వారికి ప్రభుత్వపథకాలు రద్దు చేయండి... ఆదాయపు పన్ను పెంచండి: సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని వారిపట్ల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-23 06:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని వారిపట్ల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఓటు హక్కు వినియోగించుకోని వారికి ఆదాయపన్ను పెంచడం లాంటి జరినామాలు కూడా విధించాలని కూడా సూచించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ప్రసంగించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఓటు హక్కు వినియోగం తప్పనిసరి చేయాలని లక్ష్మీనారాయణ సూచించారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఓట్ల ప్రలోభాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో 95 నుంచి 99 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే రాజకీయ మార్పు రావడం ఖాయమన్నారు. అంతేకాదు కుల, ధన, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగితే దాని పర్యవసానాలు ఎంతో బాగుంటాయని అన్నారు. అలాగే ఎన్నికల ముందు ప్రీ పోల్‌ సర్వేలు ప్రకటించకుండా ఉంటే చాలా మంచిదని వ్యాఖ్యానించారు. మరోవైపు 2024 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సమాజం కోసం పని చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకొని రాజులవుతారా? ఓటు విక్రయించుకొని బానిసలవుతారా? అన్నది తేల్చుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు.

ఓటుహక్కుతో మంచి నాయకుడిని ఎంచుకోవాలి

2024 ఎన్నికల్లో ఓటర్లు పార్టీలను, మతాలను కాకుండా పోటీ చేసే వ్యక్తులను చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైందని..దాని ప్రకారమే పాలన సాగాలని ఆకాంక్షించారు. ఓటు హక్కుతో మంచి నాయకున్ని ఎంచుకొవాలి.. అది ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యం అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఓటు వేసేముందు పార్టీని, కులాన్ని చూడొద్దని కోరారు. ఆయా పార్టీల నాయకులు వ్యక్తగత అజెండాలతో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు, నాయకులు వ్యక్తిగత అజెండాతో పోటీ చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయగలం అనే ఆలోచనలో మార్పు రావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News