AP News:కోనసీమ జిల్లాలో 63 వేలమంది పట్టభద్రులు-జిల్లా కలెక్టర్
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం లో భాగమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 6వ తేదీ వరకు 63,000 మంది పట్టబద్రులు ఓటు హక్కు కొరకు దరఖాస్తులు సమర్పించారని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.
దిశ, అమలాపురం: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం లో భాగమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 6వ తేదీ వరకు 63,000 మంది పట్టబద్రులు ఓటు హక్కు కొరకు దరఖాస్తులు సమర్పించారని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు పట్టభద్రుల ఓటర్ల నమోదు తుది జాబితా ప్రచురణకు సంబంధించిన పురోగతి అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల నమోదు కొరకు నోటిఫికేషన్ విడుదలైన పిదప నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా జిల్లాలో 22 మండలాలలో సుమారుగా 63,000 మంది పట్టభద్రులు ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఈనెల 23వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించడం జరుగుతుందని, అదే తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు మరల దరఖాస్తులు స్వీకరణతో పాటుగా మరియు క్లెయిమ్స్ అభ్యంతరాల కొరకు దరఖాస్తులను సమర్పించవచ్చునన్నారు.
డిసెంబర్ 25 వ తేదీన క్లెయిమ్స్ అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందని తదుపరి డిసెంబర్ 30వ తేదీన శాసనమండలికి సంబంధించిన పట్టభద్రుల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 16 కిలోమీటర్ల పరిధి లోపల 750 మంది ఓటర్లు మించకుండా 95 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తుది జాబితా ప్రచురణ అనంతరం ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాల సంఖ్య నిర్దిష్టం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటు కోసం ఇప్పటికే 2,96,643 మంది దరఖాస్తు చేశారని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తుల పై విచారణ పూర్తి చేశామని, 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారని ఆ జాబితాలో పేర్లు నమోదు కాని వారు ఎవరైనా ఉంటే మరలా దరఖాస్తు చేసుకునే సమయం వెసులుబాటు ఉందన్నారు . అదే రోజు నుంచి డిసెంబర్ 9 వరకు అర్హత ఉన్న పట్టభద్రులు మళ్లీ ఓటుకు ఆన్లైన్, ఆఫ్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు.
బూత్ స్థాయి అధికారులు విచారణ నిమిత్తం ఇళ్లకు వచ్చినప్పుడు ఒరిజినల్ డిగ్రీ ధ్రువపత్రం, లేదా గెజిటెడ్ ధ్రువీకరణ అయిన నకలు ధ్రువపత్రం చూపితే సరిపోతుందన్నారు.10+2+3 విధానంలో పొందిన డిగ్రీతోపాటు 10+3 విధానంలో ఓపెన్ వర్సిటీల్లో డిగ్రీ పొందిన వారు ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు అర్హులన్నారు. పోలింగ్ కేంద్రాలను రెండిటిని ప్రభుత్వ భవనాలలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మండల స్థాయిలో సహాయ ఓటరు నమోదు అధికారులుగా తహసీల్దార్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి చివరిగా ఆర్డీవోలు తుది వెరిఫికేషన్ చేసి నివేదికను జిల్లా కేంద్రానికి సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.మదన్మోహన్రావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున డి.రాజేంద్ర బాబు, బీజేపీ తరపున దూరి రాజేష్, సిపిఐఎం తరపున కారెం వెంకటేశ్వరరావు,బిఎస్పీ తరపున కేఎస్ఎల్ భవాని, సెక్షన్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, డిటి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.