YS Jagan:‘అప్పుల పై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం’.. మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు
రాష్ట్ర అప్పులపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్ర అప్పులపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో తాడేపల్లిలో ఈ రోజు(బుధవారం) వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరు అని వైఎస్ జగన్ అన్నారు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు.. వాస్తవాలు ఏంటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయని చెప్పారు. మేం దిగిపోయే నాటికి 4 లక్షల 91 వేల కోట్ల అప్పులు ప్రభుత్వ గ్యారంటీ అప్పులు లక్షా 54 వేల కోట్లు మొత్తం కలిపి 6 లక్షల 46 వేల కోట్ల అప్పులు అని పేర్కొన్నారు. అయితే 2023-24 కాగ్ రిపోర్ట్ కూడా 6 లక్షల 46 వేల కోట్ల అప్పులను చెప్పిందని జగన్ అన్నారు. 12 లక్షల కోట్లని ఒకసారి, 14 లక్షల కోట్లని మరోసారి అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు వ్యవస్థీకృతం చేశారన్నారు.
బడ్జెట్లో చెప్పిన లెక్కలు, బయట చెప్పే లెక్కలకు తేడా ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. మీ బడ్జెట్ లెక్కలను మీరే మార్చి చెప్తున్నారు అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే బొంకుతున్నారని.. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 2 లక్షల 57 వేల కోట్ల అప్పులు, 2019 నాటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు 55వేల కోట్లు, మొత్తం కలిపి 3లక్షల 13వేల కోట్ల అప్పులు అని చెప్పారు. ఇక 42వేల 183 కోట్ల బకాయిలు 2019లో బాబు మాకు గిఫ్ట్ గా ఇచ్చి వెళ్లారని విమర్శించారు. ఐదేళ్ల బాబు హయాంలో FRBM పరిధి దాటి 28 వేల 457 కోట్ల అప్పు అన్నారు. మా హయాంలో FRBM పరిధి దాటి 16 వందల 47 కోట్లు మాత్రమే అప్పు అని చెప్పారు. ఎవరి హయాంలో అప్పులు ఎక్కువయ్యాయో లెక్కలే చెప్తున్నాయి. మీ లెక్కలను మీరే ఒప్పుకోకపోతే బడ్జెట్ ఎందుకు పెట్టినట్టు? అని.. బడ్జెట్లో ఒకటి పెట్టి బయట మరొకటి చెబుతున్నారని మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు.