ఇంటింటి సర్వేకు శ్రీకారం.. రేపు ఆ ప్రాంతానికి 150 మంది వైద్యులు

విజయవాడలో వైద్యులు ఇంటింటి సర్వే చేయనున్నారు..

Update: 2024-09-08 14:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో విజయవాడ వద్ద బుడమేరు వాగు బీభత్సం సృష్టించింది. బుడమేరు వరద నీరు ఒక్కసారిగా విజయవాడ సింగ్ నగర్‌తోపాటు పలు ప్రాంతాలను చుట్టుముట్టింది. దీంతో ఇళ్లు, రోడ్లు, పంటలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో 4 నుంచి 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి భారీగా నీరు చేరి సామగ్రి మొత్తం తడిచిముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో ఇంటి సామాన్లు కొట్టుకుపోయాయి. దీంతో లక్షల కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలిపోయాయి.  బాధితులు వరదల్లోనే వారం పాటు గడిపారు.

దీంతో వరద బాధితుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంటింటికి వైద్య బృందాలను పంపి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం వైద్య బృందం ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నాలుగు రోజులు పాటు  మొత్తం 150 మంది వైద్యుల బృందం వరద ప్రాంతాల్లోనే పర్యటించనున్నారు. వరద బాధితుల ఆరోగ్య వివరాలు తెలుసుకోనున్నారు. ప్రాథమిక చికిత్సలు చేయనున్నారు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే  స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించనున్నారు. ఇందుకోసం వైద్య సిబ్బందికి ఇప్పటికే ఆరోగ్య శాఖ శిక్షణ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై వైద్య బృందం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేను సమగ్రంగా నిర్వహించాలన్నారు. ప్రజలకు మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలని సత్యకుమార్ పేర్కొన్నారు. 


Similar News