తెలుగు రాష్ట్రాల మధ్య పాల పంచాయితీ!
‘హెడ్ క్వార్టర్’ నిర్వచనం ప్రకారం డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తుంటే.. తమ రాష్ట్రం నుంచి కూడా పాలు సేకరిస్తున్నారు కాబట్టి తమకూ వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.. దీంతో సమైక్య రాష్ట్రంలో ఉనికిలో ఆ సంస్థను విభజించడం ఎలా అనే సందిగ్ధం ఏర్పడింది. ఇదే విషయమై సోమవారం ఇరు రాష్ట్రాల తరపున వాదనలు జరగగా.. మొదట సంస్థ ఒక్క రాష్ట్రానిదా..? లేక రెండు రాష్ట్రాలకు చెందుతుందా..? తేలిన తర్వాతే ఆస్తుల పంపకాలపై […]
‘హెడ్ క్వార్టర్’ నిర్వచనం ప్రకారం డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తుంటే.. తమ రాష్ట్రం నుంచి కూడా పాలు సేకరిస్తున్నారు కాబట్టి తమకూ వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.. దీంతో సమైక్య రాష్ట్రంలో ఉనికిలో ఆ సంస్థను విభజించడం ఎలా అనే సందిగ్ధం ఏర్పడింది. ఇదే విషయమై సోమవారం ఇరు రాష్ట్రాల తరపున వాదనలు జరగగా.. మొదట సంస్థ ఒక్క రాష్ట్రానిదా..? లేక రెండు రాష్ట్రాలకు చెందుతుందా..? తేలిన తర్వాతే ఆస్తుల పంపకాలపై స్పష్టత ఉంటుందని హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో: సమైక్య రాష్ట్రంలో ఉనికిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రస్తుతం ఏ రాష్ట్రానికి చెందుతుంది? హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకు చెందుతుందా? లేక ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాటా ఉంటుందా? ఈ అంశాలపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో షెడ్యూలు-9 జాబితాలో ఈ సంస్థ ఉన్నందున హెడ్ క్వార్టర్ నిర్వచనం ప్రకారం తెలంగాణకే చెందుతుందని న్యాయవాది వాదించారు. ఈ సంస్థ కార్యకలాపాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పాలను సేకరించే ప్రక్రియ ఉన్నందున తమకు కూడా వాటా ఉంటుందని ఆ రాష్ట్రం న్యాయవాది వాదించారు. కానీ ఈ సంస్థ విభజన ఒక్క రాష్ట్రానికే చెందుతుందా లేక రెండు రాష్ట్రాలకూ వాటా ఉంటుందా అనేది తొలుత తేలాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం షెడ్యూలు-9లోని సంస్థలకు ఉన్న ఆస్తులు, అప్పుల విభజన అదే చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తిలో తెలంగాణకు 42%, ఆంధ్రప్రదేశ్‌కు 58% చొప్పున పంపిణీ కావాల్సి ఉంటుందన్నది తెలంగాణ వాదన. దీనికి తోడు ఒక సంస్థ హెడ్ క్వార్టర్ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ భవనం ఆస్తులు (స్థిరాస్తి) ఆ రాష్ట్రానికే చెందుతాయన్నది తెలంగాణ వాదన. ఒక సంస్థ ఎండీ లేదా చైర్మన్ లేదా డైరెక్టర్ (అన్నింటికంటే ఉన్నతాధికారి) ఏ ఆఫీసులో కూర్చుని పనిచేస్తే ఆ భవనం లేదా కార్యాలయాన్ని హెడ్ క్వార్టర్‌గా పరిగణించాలని పేర్కొంది. గతంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ సైతం ‘హెడ్ క్వార్టర్’ నిర్వచనాన్ని ఇదే తీరులో లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది. దాని ఆధారంగానే తెలంగాణ తరఫు న్యాయవాది డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్‌లో ఉన్నందున ఇది తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉండదని హైకోర్టుకు స్పష్టం చేశారు. పైగా ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్థిరాస్తులు ఉన్నాయని, వీటిలో వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేయడంలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, ఈ సంస్థ తెలంగాణ భూభాగంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి పాలను సేకరిస్తూ నిర్వహణ జరుగుతున్నందున తమకు కూడా వాటా ఉంటుందని వాదించారు. ఈ సంస్థకు లాలాపేటలో ఉన్న భవనంలో మొత్తం నాలుగు అంతస్థుల్లో రెండు తెలంగాణకు, మరో రెండు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని వాదించారు. పరిపాలనా అవసరాలను ఈ రెండు అంతస్థుల నుంచి నడుపుకుంటామని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలు విన్న హైకోర్టు, ఈ భవనం, స్థిరాస్తులు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదేనా? లేక ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుందా? అనే అంశం ముందుగా తేలాలని, ఆ తర్వాతనే విభజన ప్రక్రియపై స్పష్టత వస్తుందని వాదించారు. వాదనలు ముగిశాయని పేర్కొన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.