మరోకోణం: దళితబంధు కాదు.. అందరిబంధు రావాలి!

రాష్ట్రంలో ఇప్పుడంతా దళితబంధు పైనే చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తెచ్చారని, ఈటలను ఓడించడం కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారని అంటున్నారు. ఈ పథకం మూలంగా ఆ నియోజకవర్గంలోని 45 వేల పైచిలుకు ఎస్సీ ఓట్లలో కనీసం 80శాతం టీఆర్ఎస్ ఖాతాలో పడడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఎత్తుగడ వికటించే అవకాశమూ ఉందనే వాదన లేకపోలేదు. కేవలం దళితులకే లబ్ధి చేకూర్చడం వల్ల దళితేతర ఓటర్లు […]

Update: 2021-07-31 12:06 GMT

రాష్ట్రంలో ఇప్పుడంతా దళితబంధు పైనే చర్చ నడుస్తోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తెచ్చారని, ఈటలను ఓడించడం కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారని అంటున్నారు. ఈ పథకం మూలంగా ఆ నియోజకవర్గంలోని 45 వేల పైచిలుకు ఎస్సీ ఓట్లలో కనీసం 80శాతం టీఆర్ఎస్ ఖాతాలో పడడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఎత్తుగడ వికటించే అవకాశమూ ఉందనే వాదన లేకపోలేదు. కేవలం దళితులకే లబ్ధి చేకూర్చడం వల్ల దళితేతర ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యే చాన్స్ మెండుగా ఉందని వీరి భావన. ఈ వాదనకు కౌంటర్‌గా కొందరు టీఆర్ఎస్ నేతలు ‘బీసీబంధు’ పథకాన్ని ప్రస్తావిస్తున్నారు. అవసరమైతే ఎస్టీబంధు సైతం తేగలమంటున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడరని వాళ్లంటున్నారు. ఇప్పటికే రూ. 40వేలకు పైగా కోట్లతో రైతుబంధు పథకాన్ని గత మూడేళ్లుగా విజయవంతంగా అమలుచేస్తున్న విషయాన్ని ఉటంకిస్తున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ వృద్ధులకు, వితంతువులకు రూ.2 వేల చొప్పున, వికలాంగులకు రూ.3వేల చొప్పున ఇస్తున్న విషయం మర్చిపోకూడదంటున్నారు. బీడీ కార్మికులకు, నేతన్నలకు, గౌడ వృత్తిదారులకు కూడా నెల నెలా పింఛన్లు అందుతున్నాయని, కల్యాణలక్ష్మి, రైతుబీమా, గొర్రెల పంపిణీ, వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్ వంటి పథకాల రూపంలో ప్రజలకు బోలెడంత లబ్ధి కలుగుతోందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌లో మొదలుపెట్టిన ఈ దళితబంధు పథకాన్ని వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రమంతా అమలుచేయడం ఖాయమన్న ధీమాను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.

ఏ రకంగా చూసినా దళితబంధు మంచి పథకమే. రాష్ట్రంలో ఉన్న సుమారు 18 లక్షల ఎస్సీ కుటుంబాలకు గాను 10 లక్షల కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడమంటే మామూలు విషయం కాదు. ఒక్కో కుటుంబానికి నేరుగా బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు జమ చేయడం వల్ల దారిద్రరేఖకు దిగువన ఉన్న ఎన్నో దళిత కుటుంబాలు జీవనోపాధి పొందుతాయి. ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడతాయి. వారి సామాజిక హోదా మెరుగుపడుతుంది. పెట్టుబడి కోసం మరెవరి పైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందుకే, ప్రతిపక్షాలైనా, ప్రజాసంఘాలైనా ఇప్పటి వరకు ఈ పథకాన్ని విమర్శించలేదు. హుజూరాబాద్‌తోనే ఆగిపోకూడదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వెంటనే అమలు చేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. తన సెగ్మెంట్‌లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తానంటే రాజీనామాకు సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు కూడా. బీసీ బంధు తేవాలని, ‘సంచార’బంధు గురించి కూడా ఆలోచించాలని మరికొన్ని వర్గాలు కోరుతున్నాయి. సమీప భవిష్యత్తులో కులాలవారీగా మరిన్ని ‘బంధు’ల డిమాండ్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.

ఆ మాటకొస్తే, కేసీఆర్ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రజాసంక్షేమ లక్ష్యాన్నే కలిగివున్నాయి. వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం కోసం తెచ్చిన రైతుబంధు సాగుఖర్చుల కోసం ఉపయోగపడుతోంది. ఉచిత విద్యుత్తు వారిపై కరెంటు బిల్లుల భారాన్ని నివారిస్తున్నది. 60 ఏళ్ల లోపు రైతులు మరణిస్తే రూ. 5 లక్షలు బీమా సాయం చేయడం ఆ కుటుంబాలు బజారున పడకుండా చేస్తున్నది. కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకం పేదింటి ఆడపిల్లలను ఓ ఇంటివాళ్లను చేస్తున్నది. రకరకాల పింఛన్లు ఆయా వర్గాల అభాగ్యులను ఆకలిచావుల నుంచి కాపాడుతున్నాయి. కొడుకులు, కూతుళ్ల ఆదరణకు నోచని వృద్ధులు, భర్త చనిపోయి అనాథలైన మహిళలు, పనిచేయలేని వికలాంగులు, పని దొరక్క ఉపాధి కోల్పోయిన వృత్తిదారులు ఈ పింఛన్ల మూలంగా తలెత్తుకుని జీవించగలుగుతున్నారు. గొర్రెల పంపిణీ, చేపపిల్లల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా ఆయా కులాల పేదలను ఆదుకుంటున్నాయి. పాక్షికంగానే అమలైనా, డబుల్ బెడ్రూం ఇళ్ల స్కీం కూడా నీడ లేని పేదలకు ఉపయోగపడే పథకమే.

2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం, తెలంగాణలో మొత్తం ఒక కోటి ఒక లక్షా 93వేల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల్లో అనేకం ప్రభుత్వ పథకాల మూలంగా లబ్ధి పొందుతున్నాయి. రైతుబంధుతో 56 లక్షల కుటుంబాలు, రైతుబీమాతో 32 లక్షలు, ఆసరా పింఛన్లతో 39 లక్షలు, రేషన్ బియ్యం తీసుకుని 88 లక్షలు, కల్యాణలక్ష్మి-షాదీముబారక్‌తో 6 లక్షలు, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌తో 4 లక్షలు, గొర్రెల పంపిణీతో 3.76 లక్షలు, చేపపిల్లల పెంపకంతో 1.50 లక్షలు, ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్‌తో 2 లక్షల కుటుంబాలు ఇప్పటివరకు ప్రయోజనం పొందాయి. అంటే ఒక్కో కుటుంబం ఒకటి కంటే ఎక్కువ పథకాలను పొందుతున్నదనేది చాలా స్పష్టం. మూడెకరాల భూమి ఉన్న ఒక రైతు కుటుంబాన్ని ఉదహరణగా తీసుకుంటే రైతుబంధు, రైతుబీమా తప్పనిసరి వర్తిస్తాయి. తెల్లకార్డు ఉంటుంది కనుక రేషన్ బియ్యం వస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రులుంటే ఒక పింఛను, వికలాంగులు ఉంటే మరో పింఛను, చదువుకునే విద్యార్థులుంటే ఫీజు వాపస్, పెళ్లి కావాల్సిన కూతురు ఉంటే కల్యాణలక్ష్మి, వ్యవసాయ మోటారు ఉంటే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తాయి. ఇక వారి కులాన్ని బట్టి గొర్రెలో, బర్రెలో, మరేదో అదనంగా ఇంకో పథకం అందే అవకాశం ఉండనే ఉంటుంది.

నిధుల పరంగా చూస్తే, ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఎనిమిది బడ్జెట్లలో కలిపి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మొత్తం 3,94,517 కోట్లను కేటాయించింది. 2014-15లో 31,774 కోట్లు, 2015-16లో 40,231 కోట్లు, 2016-17లో 41,600 కోట్లు, 2017-18లో 49,174 కోట్లు, 2018-19లో 55,365 కోట్లు, 2019-20లో 42,051 కోట్లు, 2020-21 60,905 కోట్లు, 2021-22లో 73,417 కోట్లు కేటాయించింది. కొంచెం అటూ ఇటుగా ఈ నిధులను ఖర్చు చేస్తున్నారనుకున్నా, ఒక్కో కుటుంబానికి సరాసరిగా ఈ ఎనిమిదేళ్లలో రూ. 3,50,000 కోట్ల సాయం అందిందని లేదా అందబోతుందని అంచనా. ఏడాదికి లెక్క వేస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 42వేల పైచిలుకు, నెలకు లెక్కిస్తే రూ. 3500కు పైచిలుకు లబ్ధి కలుగుతుంది.

అయినప్పుడు రాష్ట్రంలో పేదరికం, దారిద్య్రం ఎందుకుంది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అప్పుల బాధతో ఉసురు ఎందుకు తీసుకుంటున్నారు? ఆకలితో కొందరు ఎందుకు అలమటిస్తున్నారు? బిచ్చమెత్తుకుంటున్న వాళ్ల పరిస్థితి ఏంటి? ఉపాధి లేక ఎందుకు వలస పోతున్నారు? ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. ఎందుకంటే పైన చెప్పినవన్నీ కాగితాల్లో లెక్కలు. వాస్తవాలు మరోలా ఉన్నాయి. పథకాలన్నీ అందినవాళ్లకే మళ్లీ మళ్లీ అందుతున్నాయి. కలిగినోళ్లు, ధనికులే లబ్ధి పొందుతున్నారు. పైరవీలు చేసేవాళ్లు, చేయించుకునే కెపాసిటీ ఉన్నవాళ్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, కులసంఘాల నేతలే అన్నింటిలో లబ్ధిదారులుగా ఉంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన స్కీంలు కూడా అందులోని క్రీమీ లేయర్‌కే అందుతున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవాళ్లకు, తిండి లేనివాళ్లకు, భూమిలేని కూలీలకు, అనాథలకు ఒక్క రేషన్ బియ్యం మాత్రమే అందుతున్నాయి.

రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, సంచారబంధు, చేనేతబంధు, రజకబంధు.. ఇలా వృత్తులు, కులాలు, వర్గాల వారీగా సంక్షేమ పథకాలను తీసుకువచ్చే బదులుగా అందరి బంధు పథకం రావాలి. పేదల బంధు రావాలి. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వేలాగా తెలంగాణ వ్యాప్తంగా మరో సర్వే చేపట్టాలి. ప్రతి కుటుంబం ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా లెక్కించాలి. ఆయా కుటుంబాలకున్న స్థిరచరాస్తులు, ఆదాయం, సామాజిక హోదా ప్రాతిపదికన జనాభాను వివిధ కేటగరీలుగా వర్గీకరించాలి. అట్టడుగు మెట్టున ఉన్నవాళ్లకు అత్యధిక లబ్ధి కలిగేలా పాలసీని రూపొందించాలి. అప్పుడే నిజమైన పేదలకు, అభాగ్యులకు సర్కారు అండ లభిస్తుంది. కేసీఆర్ కంటున్న బంగారు తెలంగాణ స్వప్నం నెరవేరుతుంది. లేదంటే ఎన్ని పథకాలు చేపట్టినా, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంటుంది తప్ప పరిస్థితి మారదు.

– డి మార్కండేయ

Tags:    

Similar News