ఆ ఘటనతో సర్కారుపై విమర్శలు

దిశ, న్యూస్‌బ్యూరో: అగ్ని ప్రమాద అనంతర పరిణామాల్లో 9 మందిని బలి తీసుకున్న శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అధునాతన భద్రత, రక్షణ, ప్రమాద నివారణ సదుపాయాలు లేకపోవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదల్లో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్లాంటు భద్రతపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణానది ప్రవాహాన్ని ఆసరాగా చేసుకుని నిర్మించిన ఈ భూగర్భ జల విద్యుత్ కేంద్రం 2001 సంవత్సరం నుంచి ఉమ్మడి […]

Update: 2020-08-21 20:27 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: అగ్ని ప్రమాద అనంతర పరిణామాల్లో 9 మందిని బలి తీసుకున్న శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో అధునాతన భద్రత, రక్షణ, ప్రమాద నివారణ సదుపాయాలు లేకపోవడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదల్లో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్లాంటు భద్రతపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణానది ప్రవాహాన్ని ఆసరాగా చేసుకుని నిర్మించిన ఈ భూగర్భ జల విద్యుత్ కేంద్రం 2001 సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అందుబాటులోకి వచ్చింది. 2004లో తొలిసారి 900 మెగావాట్ల పూర్తిస్థాయి సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగమవుతున్న 180 నుంచి 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ లో 29 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుత్ కేంద్రాల నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 1800 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం నుంచే 900 మెగావాట్ల పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జెన్ కో అధికారులు పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ పై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది భద్రత, రక్షణ చర్యలపై మాత్రం దృష్టిపెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈయేడు వర్షాలు అనుకున్న సమయం కంటే ముందే కురుస్తుండడంతో వరదలు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్లాంట్లలో అవసరమైన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. ఉత్పత్తి ఒత్తిడిలోనే శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు.

పొగతోనే ప్రాణాపాయం..

భూ గర్భ జలవిద్యుత్ కేంద్రం కావడంతో దీనిలోకి నీటిని పంపు చేసి టర్బైన్ లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే రెట్టింపు భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భూ గర్భం కావడంతో దీనిలో వెలుతురు అంతగా ఉండదు. ఫ్లోర్లు మల్టీ స్టోర్డ్​ భవనంలో కిందికి అంతస్తులుగా ఉంటాయి. నీటి ప్రవాహం కన్నా కిందకు విద్యుత్ ప్లాంటు ఉంటాయి కావున ఈ ప్లాంట్లలో అత్యంత పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లోపల ఉన్న సిబ్బంది ఊపిరాకడ చనిపోతుంటారు. మంటలంటుకునే లోపే దట్టమైన నల్లని పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మరణం సంభవిస్తుంది. గురువారం రాత్రి శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.

కంట్రోల్ ప్యానెల్ లో షార్ట్ సర్క్యూట్ తో తొలుత ప్లాంటులో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బందిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయట పడ్డారు. మరో ఆరుగురిని సహాయక సిబ్బంది రక్షించగా 9 మంది ఉద్యోగులు మాత్రం ప్లాంటులో చెలరేగిన మంటలార్పడానికి మరింత లోపలికి వెళ్లి దట్టమైన పొగలో చిక్కుకు పోయారు. ఇలాంటి సమయాల్లో వారు మరింత లోపలికి వెళ్లకుండా సొరంగానికి ఉన్న రెండు అత్యవసర మార్గాల్లో బయటికి వచ్చి ఉంటే ప్రాణాలతో ఉండేవారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొత్త ప్లాంట్లలో అయితే సొరంగాల నుంచి దట్టమైన పొగ బయటికి వెళ్లడానికి అవసరమైన వెంటిలేషన్ వ్యవస్థ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టన్నెళ్లలో పొగ కారణంగా లోపల చిక్కుకున్న వాళ్లని రక్షించడం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం కూడా అంత సులభం కాదు. దట్టమైన పొగతో ఏమీ కనిపించని పరిస్థితులు నెలకొంటాయి.

వరదలతో మరింత అపాయం..

భూగర్భ జల విద్యుత్ కేంద్రాలకు అది ఉన్న నదులకు వరదలు పోటెత్తుతే భారీ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. వరదలు వచ్చినపుడు నీరు బయటికి పోయే డ్రైన్ పైపుల మీద ఒత్తిడి పెరిగి అవి పగిలిపోతే నీరంతా ప్లాంటు సొరంగాన్ని ముంచెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో నీటి మట్టంపై హెచ్చరించడానికి అలారమ్ వ్యవస్థ ఉంటుందని, ఈ అలారం మోగడాన్ని సంకేతంగా తీసుకొని ప్లాంటు గురించి ఆలోచించకుండా ఉద్యోగులంతా అత్యవసర మార్గాల ద్వారా బయటికి వెళ్లాల్సి ఉంటుందని వారు అంటున్నారు. 2009లో కృష్టా నదికి భారీ వరదలు వచ్చినపుడు శ్రీశైలం నిండిపోయి కుడి, ఎడమ గట్టుల మీద ఉన్న జల విద్యుత్ కేంద్రాలు రెండూ నీట మునిగిపోయిన విషయం తెలిసిందే.

పాత ప్లాంట్లలో భద్రతా చర్యలు అంతంతే…

పాత ప్లాంట్లను భద్రతా అంశాల పరంగా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న కొత్త హైడల్ ప్లాంట్లలో అయితే పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకొని అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. అయితే పాత ప్లాంట్లలో కొత్త ప్లాంట్లలాగా భద్రతా చర్యలు పూర్తిస్థాయిలో రెనోవేట్ చేయడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా అప్పుడప్పుడు అవసరమైన రిపేర్లు, మెయింటెనెన్స్, సర్వీసింగ్ చేయడం తప్ప పెద్దగా రెనోవేట్ చేసిన దాఖలేవీ లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News