Farmers Subsidy: రైతులకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. వారికి మూడేళ్ల పాటు సబ్సిడీ

రైతులకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తీపి కబురు చెప్పారు.

Update: 2024-07-19 12:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. మూడేళ్లపాటు సహజ వ్యవసాయం చేసే రైతులకు సబ్సిడీ కల్పించబోతున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చహాన్ చెప్పారు. శుక్రవారం గుజరాత్ లో సహజ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో గజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తదితరులతో కలిసి శివరాజ్ సింగ్ చౌహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సహజ వ్యవసాయం దిశగా మళ్లాలని పిలుపునిచ్చారు. దేశంలోని రైతులు తమ భూమిలో కొంత భాగంలో సహజ వ్యవసాయం చేయాలని మూడేళ్లపాటు సబ్సిడీ పొందాలని పిలుపునిచ్చారు. ప్రారంభ రెండేళ్లలో రైతులు సహజ వ్యవసాయం చేస్తే దిగుబడి తక్కువగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తుందని మంత్రి వెల్లడించారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యం, పండ్లు, కూరగాయలను విక్రయించడం ద్వారా రైతులకు 1.5 రెట్లు ఎక్కువ ధర లభిస్తుందన్నారు. రసాయనాల నుండి భూమాతను రక్షించాలనే ప్రధాన మంత్రి కలను సాకారం చేస్తూ.. రైతులు రసాయన రహిత వ్యవసాయం చేయడం ద్వారా రాబోయే తరం ఆరోగ్యంగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో సహజ సాగుపై అధ్యయనం, పరిశోధనల కోసం ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఈ అంశంలో దేశంలోని కోటి మంది రైతులకు అవగాహన కల్పిస్తామని, తద్వారా వారు దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రచారం చేయవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని భాగస్వాములతో చర్చించి సహజ వ్యవసాయంపై జాతీయ స్థాయి అవగాహన ప్రచారాన్ని చేపడతామన్నారు.

Tags:    

Similar News