ముంబై ఎయిర్‌పోర్టులో మెజారిటీ వాటా అదానీ కైవసం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బహుళజాతి సంస్థ అదానీ గ్రూప్ (Adani Group) రెండో అతిపెద్ద విమానాశ్రయం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MIAL)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్.. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్‌నేషనల్ విమానాశ్రయంలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ మొత్తంలో జీవీకే గ్రూప్ (GVK Group) నుంచి 50.5 శాతం, ఇతర మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నుంచి 10 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బహుళజాతి సంస్థ అదానీ గ్రూప్ (Adani Group) రెండో అతిపెద్ద విమానాశ్రయం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MIAL)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్.. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్‌నేషనల్ విమానాశ్రయంలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది.
ఈ మొత్తంలో జీవీకే గ్రూప్ (GVK Group) నుంచి 50.5 శాతం, ఇతర మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నుంచి 10 శాతం, బిడ్‌వెస్ట్ గ్రూపునకు 13.5 శాతం వాటాలను దక్కించుకుంది. ఈ కొనుగోలు ద్వారా అదానీ సంస్థ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌గా నిలిచింది. అంతేకాకుండా, అదానీ గ్రూప్ అతిపెద్ద విమానాశ్రయాన్ని దక్కించుకోవడం ఇది తొలిసారి.
ఈ కొనుగోలు కోసం అదానీ గ్రూప్ సుమారు రూ. 15 వేల కోట్లను చెల్లించనుంది. ఈ కొనుగోలు తర్వాత ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, బ్రాండ్‌కి సంబంధించినవి అదానీ గ్రూప్ పరిధిలో ఉంటాయి. గతేడాది మార్చిలో బిడ్‌వెస్ట్ గ్రూపునకు చెందిన వాటాను సుమారు రూ. 1,250 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
అయితే, మెజారిటీ వాటాను కలిగి ఉన్న జీవీకే సంస్థ… భాగస్వామి వాటాలను కొనుగోలు చేసేందుకు తాము నిరాకరిస్తే తప్ప ఆ వాటాలను వేరే వాళ్లు కొనేందుకు వీల్లేదని ఆ ప్రక్రియను ఆపేసింది. ఈ క్రమంలో అప్పుల్లో ఉన్న జీవీకే పవర్ సంస్థ ఈ వాటాలను కొనేందుకు నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీంతో చివరికి ఈ వ్యవహారం అదానీ గ్రూపునకు దక్కింది.
విధించిన గడువులోగా జీవీకే గ్రూప్ వాటాను కొనలేకపోవడంతో, బిడ్‌వెస్ట్ గ్రూప్ (Bidvest Group) వాటాలను ఇతరులకు విక్రయించడానికి అనుమతి కోసం కోర్టుకెళ్లింది. జీవీకే గ్రూప్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో అదానీ గ్రూప్ కొనుగోలుకు ఆసక్తి చూపించింది. దీంతో మొత్తం 74 శాతం వాటా అదానీ గ్రూప్ చేతికొచ్చింది. ఇప్పటికే ఇంధన, పోర్టుల వ్యాపారాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్, ఈ వాటాలను కొనుగోలు చేయడంతో అతిపెద్ద ప్రైవేట్ విమానాశ్రయాల నిర్వహణ సంస్థగా నిలిచింది.