రాంకీ సంస్థ లీలలు.. రూ. 1200 కోట్ల కృత్రిమ నష్టం
దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యర్థాల నిర్వహణ రంగాల్లోని ఒక గ్రూపు సంస్థ ఉద్దేశపూర్వకంగా లాభాల వివరాలను దాచిపెట్టి కృత్రిమంగా నష్టాలను చూపెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. హైదరాబాద్‌కు చెందిన రాంకీ గ్రూపు సంస్థ పేరును వెల్లడించని ఐటీ శాఖ ఈ నెల 6వ తేదీన జరిపిన సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. సింగపూర్‌కు చెందిన ఒక సంస్థకు 2018-19లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యర్థాల నిర్వహణ రంగాల్లోని ఒక గ్రూపు సంస్థ ఉద్దేశపూర్వకంగా లాభాల వివరాలను దాచిపెట్టి కృత్రిమంగా నష్టాలను చూపెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. హైదరాబాద్‌కు చెందిన రాంకీ గ్రూపు సంస్థ పేరును వెల్లడించని ఐటీ శాఖ ఈ నెల 6వ తేదీన జరిపిన సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
సింగపూర్‌కు చెందిన ఒక సంస్థకు 2018-19లో ఒక ప్రవాస సంస్థకు సింహభాగం వాటాను విక్రయించి పెద్దమొత్తంలో డబ్బును ఆర్జించినట్లు ఐటీ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ విక్రయాల తర్వాత బోనస్ చెల్లింపు, షేర్ల కొనుగోలు, అమ్మకం తదితరాలను చూపెట్టి నష్టం వచ్చినట్లు సదరు కంపెనీ బుకాయించిందని పేర్కొన్నది. సుమారు రూ. 1200 కోట్లు నష్టం వచ్చినట్లు చూపించిందని, కానీ రూ. 300 కోట్ల మేర లెక్కల్లోకి రాని ఆదాయం వివరాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది. మరో రూ.288 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు కూడా ఆ సంస్థ చూపించినా వాస్తవానికి ఇది విరుద్ధం అని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది.
ఈ గ్రూపుకు చెందిన మరికొన్ని సంస్థలతో నగదు రూపంలో జరిపిన లావాదేవీల వివరాలు సైతం సోదాల సందర్భంగా చిక్కినట్లు పేర్కొన్నది. అయితే ఎంత మొత్తంలో ఇలాంటి లావాదేవీలు జరిగాయో, ఏ పద్ధతిని అవలంబించారో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నది. కేవలం లాభాలను కప్పిపుచ్చుకోడానికి ఈ తరహాలో నష్టాలు వచ్చినట్లుగా చూపించిందని వ్యాఖ్యానించింది. సోదాల సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లతో పాటు కొన్ని విడివిడి కాగితాలు, లెక్కల్లోకి రాకుండా ఉండిపోయిన కొన్ని ఆర్థిక వివరాలు కూడా లభ్యమైనట్లు తెలిపింది. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారని వివరించింది.
లెక్కల్లోకి రాకుండా ఉన్న రూ. 300 కోట్లు నిజమేనని ఆ సంస్థ అంగీకరించిందని, దానికి సంబంధించిన పన్ను బకాయిలను చెల్లించనున్నట్లు ఆమోదం తెలిపిందని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొన్నది. సింగపూర్ సంస్థతో జరిపిన ఆర్థిక లావాదేవీల్లో రూ. 1200 కోట్లు పన్ను కట్టాల్సిందేనని పేర్కొన్నది.