ఆ పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాల.. ప్రాణాలు పోతే బాధ్యులెవరు..?
దిశ, జనగామ: అధికారుల నిర్లక్ష్యంతో జనగామ జిల్లాలోని ఓ బాలబాలికల పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో గల కలెక్టర్ కార్యాలయంకు కూతవేటు దూరంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలకు రెండు సంవత్సరాల క్రితమే కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా, నిధులు లేవని నిర్మాణ పనులను పెండింగ్లో పెట్టారు. ఈ పాఠశాలలో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషలకు […]
దిశ, జనగామ: అధికారుల నిర్లక్ష్యంతో జనగామ జిల్లాలోని ఓ బాలబాలికల పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో గల కలెక్టర్ కార్యాలయంకు కూతవేటు దూరంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలకు రెండు సంవత్సరాల క్రితమే కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా, నిధులు లేవని నిర్మాణ పనులను పెండింగ్లో పెట్టారు. ఈ పాఠశాలలో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషలకు చెందిన విద్యార్థులు సుమారుగా నూట అరవై మందికి పైగా ఉంటారు.
గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం కరోనా పేరిట పాఠశాలలు నిర్వహించడం కష్టతరం కావడంతో, ప్రస్తుతం బుధవారం నుంచి పాఠశాలలు తెరవడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థులు కరోనా కంటే పాఠశాల ఎప్పుడు కూలుతుందో అని భయంగా తరగతి గదిలో కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది. ఇట్టి విషయంపై గతంలో ఉన్న ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారి ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు తీసుకువచ్చినా, నేటికీ నిధుల జాప్యంతో పనులు ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
సాధారణ మధ్య తరగతి విద్యార్థుల పిల్లలందరూ ఈ పాఠశాలలో అభ్యసించడం గమనార్హం. ఇప్పుడు పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వెంటనే పాఠశాలకు మరమ్మతులు చేయించి నూతన భవన నిర్మాణం చేపట్టాలని పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు గత నాలుగు రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుకు సైతం ట్విట్టర్లో పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని సందిగ్ధత నెలకొంది. ఇట్టి పాఠశాల పరిస్థితి దిశ పత్రిక సందర్శించి తీసుక వచ్చిన చిత్రాలు ఇలా ఉన్నాయి.