అమ్మా.. నేను ఆడుకుంటా.. ఆ చిన్నారి చివరి మాటలు అవే!
దిశ, సూర్యాపేట: తల్లితో సరదాగా వెళ్లిన చిన్నారికి అదే చివరి ఆట అయింది. నీళ్లలో ఆడుకుంటూ తల్లి ముందే ప్రాణాలు వదిలింది. అప్పటి వరకు కళ్ల ముందే బోసి నవ్వులతో అల్లరి చేసిన కూతురు జల సమాధి కావడంతో ఆ తల్లి జీర్ణించుకోలేక పోతోంది. గ్రామాన్నే కంట తడి పెట్టించిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన […]
దిశ, సూర్యాపేట: తల్లితో సరదాగా వెళ్లిన చిన్నారికి అదే చివరి ఆట అయింది. నీళ్లలో ఆడుకుంటూ తల్లి ముందే ప్రాణాలు వదిలింది. అప్పటి వరకు కళ్ల ముందే బోసి నవ్వులతో అల్లరి చేసిన కూతురు జల సమాధి కావడంతో ఆ తల్లి జీర్ణించుకోలేక పోతోంది. గ్రామాన్నే కంట తడి పెట్టించిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన సూర రమేష్, మనీష దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుర్లు కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మనీష బట్టలు ఉతికేందుకు గ్రామ సమీంలోని శంభోని చెరువు అలుగు వద్దకు వెళ్లింది. తల్లితోపాటు పెద్ద కూతురు మిన్నీ (7) వెళ్లింది. కాగా, అలుగు నీరు రోడ్డుపై పారుతుండడంతో పాతర్లపహాడ్, తాళ్ల సింగారం గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్తుల వినతి మేరకు అధికారులు అలుగుల వద్ద రోడ్డుపై సిమెంట్ గూనలు వేశారు. అయితే అలుగు వద్ద గ్రామస్తులు నిత్యం బట్టలు ఉతుకుతుంటారు.
అదే మాదిరిగా మనీష వెళ్లింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా.. అమ్మా.. నేను ఆడుకుంటా అంటూ మిన్నీ అలుగుల్లో ఆడుకుంటుంది. అయితే చిన్నారి ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడి అలుగు కింద ఉన్న సిమెంట్ గూనల్లో చిక్కింది. వెంటనే తల్లి గుర్తించి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు వచ్చి మిన్నీని బయటకు తీశారు. కానీ అప్పటికే అరగంట గడవడం.. అలుగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. ‘‘శంభోని చెరువుకు వచ్చి శంకరుడి దగ్గరకు వెళ్లావా బిడ్డా..’’ అంటూ తల్లిదండ్రులు మిన్నీ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకోని ఏడుస్తున్న తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.