తరలిన 7600 టన్నుల భవనం!

దిశ, వెబ్‌డెస్క్: ఒక వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం చాలా తేలికైన విషయమే కానీ.. ఓ ఇల్లును మోసుకెళ్లడం లేదా ఓ మహా వృక్షాన్ని తరలించడం కాస్త కష్టమైన పనే. కానీ ఇటీవల కాలంలో ఏళ్ల తరబడి పెరిగిన మహా మహా వ‌ృక్షాలను కూడా వేళ్లతో సహా పెకిలించి, వాటిని మరో చోట నాటి జీవం పోస్తున్నారు. చైనాలోని షాంఘై నగరంలో ఇంజినీర్లు అలాంటి అద్భుతమైన ఫీట్‌నే చేసి చూపించారు. 7600 టన్నుల […]

Update: 2020-10-26 04:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒక వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం చాలా తేలికైన విషయమే కానీ.. ఓ ఇల్లును మోసుకెళ్లడం లేదా ఓ మహా వృక్షాన్ని తరలించడం కాస్త కష్టమైన పనే. కానీ ఇటీవల కాలంలో ఏళ్ల తరబడి పెరిగిన మహా మహా వ‌ృక్షాలను కూడా వేళ్లతో సహా పెకిలించి, వాటిని మరో చోట నాటి జీవం పోస్తున్నారు. చైనాలోని షాంఘై నగరంలో ఇంజినీర్లు అలాంటి అద్భుతమైన ఫీట్‌నే చేసి చూపించారు. 7600 టన్నుల బరువైన ఓ పెద్ద భవనాన్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లారు.

పురాతన, చారిత్రక భవనాలను.. ఏ దేశమైనా కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యతనిస్తుంది. అలా 1995‌లో నిర్మించిన ఓ ఐదు అంతస్తుల భవనాన్ని కాపాడుకోవడానికి చైనా ప్రభుత్వం సాహసం చేసింది. షాంఘై నగరంలో ఓ కొత్త ప్రాజెక్టు కోసం అవసరమైన భవనాన్ని నిర్మించడానికి 1935 నాటి ఆ ఐదంతస్తుల స్కూల్‌ బిల్డింగ్‌ అడ్డుగా నిలిచింది. అందుకే ఆ భవనాన్ని పడగొట్టకుండా, సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించి బిల్డింగ్‌ను వేరే చోటుకు మార్చాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రోబోటిక్ టెక్నాలజీ సాయంతో.. 7600 టన్నుల బరువున్న ఆ కాంక్రీట్‌ భవనాన్ని ఉన్నచోటు నుంచి 62 మీటర్ల దూరం తరలించి ఔరా అనిపించారు.

బిల్డింగ్‌లను ఇలా ఒక చోటు నుంచి మరొకచోటుకు మార్చడానికి సాధారణంగా భవనాలను ప్లాట్‌ఫామ్‌ల మీదకు చేర్చి అధిక సామర్ధ్యం ఉన్న క్రేన్‌లు, గొలుసుల ద్వారా లాగుతారు. కానీ ఈ భవనం విషయంలో చైనీస్‌ ఇంజినీర్లు తొలిసారి రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో భాగంగా రోబోటిక్ లెగ్స్‌ (రోబో కాళ్లు) ద్వారా భవనాన్ని జరిపారు. ఈ రోబోటిక్‌ లెగ్స్‌ కింద చక్రాలు ఉంటాయి. అవి మెల్లిమెల్లిగా ఒకే టైమ్‌లో ముందుకు కదులుతుంటే.. వాటిపై ఉన్న భవనం కూడా ముందుకు కదులుతుంది. ఇలా ఈ భవనాన్ని ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చడానికి 18 రోజులు పట్టింది. మొత్తంగా 62 మీటర్ల దూరం తరలించారు.

ఈ బిల్డింగ్‌ను మార్చడానికి పని చేసిన ఇంజినీర్లకు గతంలో కూడా ఈ పనులు చేసిన అనుభవం ఉంది. 135 సంవత్సరాల కిందట నిర్మించిన 2 వేల టన్నుల బరువైన బుద్ధుడి ఆలయాన్ని 2017లో 30 మీటర్ల దూరం తరలించారు. ఈ 30 మీటర్ల తరలింపుకు 15 రోజుల సమయం పట్టింది.

Tags:    

Similar News