ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలను ఓ వైపు చలి మరోవైపు వర్షాలు ముంచెత్తుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలను ఓ వైపు చలి మరోవైపు వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత నెలన్నర రోజులుగా అల్పపీడనాలు, తుఫానులు వరుసగా వస్తూ.. వర్షాలను తెస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా తాజా అల్పపీడనంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు, 24 గంటల తర్వాత చిత్తూరు, విశాఖ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.