Cyclone Update: బంగాళాఖాతంలో తుపాన్.. "దానా"గా నామకరణం..!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రానున్న రెండ్రోజుల్లో వాయుగుండంగా మారి.. తుపానుగా బలపడనుందని ఐఎండీ పేర్కొంది.

Update: 2024-10-21 03:48 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(Low Pressure).. ప్రస్తుతం ఉత్తర అండమాన్ పై కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఎల్లుండి (అక్టోబర్ 23)కి తుపాను(Cyclone)గా మారే అవకాశం ఉందని ఐఎండీ (IMD) వెల్లడించింది. ఈ తుపానుకు భారత వాతావరణ శాఖ దానా(Dana Cyclone) గా నామకరణం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 24న తుపాను ఒడిశా - పశ్చిమ బెంగాల్ ల మధ్యం తీరం దాటుతుందని అంచనా వేసింది.

కోస్తాలో విస్తారంగా వర్షాలు

అల్పపీడనం, ఆ తర్వాత తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూల్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగే.. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. తుపాను ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉండే అవకాశం లేదని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. 


Similar News