అలర్ట్.. రానున్న 3 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం
రానున్న 3 గంటల్లో హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురవనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్నిజిల్లాలకు భారీ వర్షసూచన చేసింది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజులుగా ఇది వర్షాకాలమా ? వేసవి కాలమా? అన్నట్లుగా ఎండలు కాచాయి. తీవ్ర ఎండ, ఉక్కపోతతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనూహ్యంగా వాతావరణం మారింది. ఉదయం నుంచీ ఆకాశంలో మబ్బులు కమ్మి.. వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లోనూ నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
హైదరాబాద్ తో పాటు.. జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరకోస్తా తమిళనాడు నుంచి లక్షద్వీప్ తో పాటు.. అరేబియా సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.