ఫెంగల్ ఎఫెక్ట్.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మొత్తం 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
వారం క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త.. తీవ్ర వాయుగుండంగా మారి.. అది ఫెంగల్ తూఫాన్ గా రూపాంతరం చెందింది.
దిశ, వెబ్ డెస్క్: వారం క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త.. తీవ్ర వాయుగుండంగా మారి.. అది ఫెంగల్ తూఫాన్ గా రూపాంతరం చెందింది. కాగా ఈ ఫెంగల్ తుఫాన్.. దేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో భీభత్సం సృష్టిస్తుంది. శనివారం సాయంత్రం తీరం తాకిన ఈ ఫెంగల్ తుఫాన్.. కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.
కాగా ఈ తుఫాను కారణంగా రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురవనుండగా.. తమిళనాడులో తిరువణ్ణామలై, విలుపురం,కళ్లకురిచ్చిలో జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అలాగే ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే మరో ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా.. పుదుచ్చేరిలోని అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి. వర్షం కాస్త తగ్గడంతో.. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే కేరళలోని శబరిమల తో పాటు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరికలు అమలులో ఉండటంతో.. శబరిమల కి వెళ్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ రిస్క్ చేయవద్దని స్థానిక ప్రభుత్వం సూచించింది.