ఆమె నా కాబోయే భార్య.. ఇంటర్ ఫ్రెండ్‌లో ఎఫైర్ ఉందా అని అడిగితే తప్పా..?
నేను, సారిక ప్రేమించుకుంటున్నాము. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇద్దరిది పీజీ అయిపోయింది.
నేను, సారిక ప్రేమించుకుంటున్నాము. పెద్దలు కాదన్నా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇద్దరిది పీజీ అయిపోయింది. మొన్న ఒక ఫంక్షన్‌లో నేను సారికను అనరాని మాట అన్నానని ఆమె నాతో మాట్లాడం మానేసింది. పెళ్లి కూడా వద్దంటుంది. ఎవరో అబ్బాయి సారికతో రెండుసార్లు మాట్లాడాడు. ఇంటర్ ఫ్రెండ్. ‘‘ఇంత గుర్తు పెట్టుకొని ఎందుకొచ్చారు? అంతలా ఏం మాట్లాడాడు. మీకేమయినా ఎఫైర్ నడిచిందా..? నడిస్తే చెప్పు. ఇలాంటివి పెళ్లి తరువాత కొనసాగనివ్వను అన్నాను.’’ దీనిలో ఏమైనా తప్పుందా..? దీనికే ఆమెకు అంత కోపం రావాలా? ఆమె నానుంచి విడిపోతుందేమో అన్న భయం పట్టుకుంది. ఏమి చేయమంటారో చెప్పండి మేడమ్. -వినోద్, వరంగల్.
ఐదేళ్ల బంధం కాదని అనుకుంటుందంటే నువ్వు బాగా ఆమె మనసుని నొప్పించే మాటలే అని ఉంటావు. అన్నావు కూడా. ఆమె తన స్నేహితుడితో పెళ్లిలో గుర్తుపట్టి రెండుసార్లు మాట్లాడితే వాళ్లిద్దరికి సంబంధం అంతగట్టేసి.. ఆమె గతం మీద.. నీతో కలిసి బతకబోయే భవిష్యత్తు మీద నీ అనుమానాన్ని, అధికారాన్ని ప్రకటించాక.. ఆమెకు నీతో తన వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో బాగా అర్థమైపోయింది. ఆమె జాగ్రత్త పడుతుతున్నది. ఆలోచిస్తుంది. భార్య అవగానే ఆమె ఆకాంక్షల మీద.. ఆమె జీవితం మీద పురుషుడు అధికారి అవుతాడు అనుకునే పితృస్వామ్య భావనలకు కాలం చెల్లిన ఆధునిక కాలం ఇది. అమ్మాయిలు భర్తకు చెందిన ఆస్తులుగానో, వస్తువులుగానో కాకుండా సొంత వ్యక్తిత్వాలతో, ఆత్మ గౌరవంతో బతకాలని అనుకుంటున్నారు. ఒకబ్బాయితో మాట్లాడితేనే అనుమానించి, ప్రేమికుల ముద్ర వేసి, బెదిరించిన నీ కుసంస్కారానికి, అనుమానపు జబ్బుకి, ఆమె నిజంగానే బెదిరింది. ఆలోచించుకోనివ్వు. ఆమెను నిర్ణయం తీసుకోనివ్వు. నిన్ను తిరస్కరించే అధికారం, హక్కు ఆమెకు ఉన్నాయి. ఈలోపు నువన్న మాటకి నీకు ఏమాత్రం పశ్చాత్తాపం కలిగినా.. ఆమెకి క్షమాపణ చెప్పు. కానీ ఆమె నిన్ను వద్దు అనుకుంటే మాటుకు నీ దారి నువ్వు చూసుకో. ఆమెని లేదా మరొక స్త్రీని అందుకునే స్థాయిని, సౌజన్యాన్ని పొందేదాక పెళ్లి గురించి ఆలోచించడం మానెయ్యి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్