IPL 2025 : ఆ రూల్‌ను అతిక్రమించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా విధించిన ఐపీఎల్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.
దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు అతనిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఇషాంత్ మ్యాచ్‌లో 25 శాతం జరిమానాగా విధించారు. అలాగే, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ సోమవారం తెలిపింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టర్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలను దుర్వినియోగం చేయడం ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం నేరం. ఈ నేరాన్ని ఇషాంత్ అంగీకరించడంతో ఐపీఎల్ నిర్వాహకులు అతనికి ఫైన్ విధించారు. ఈ సీజన్‌లో ఇషాంత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెటే తీసి 97 రన్స్ సమర్పించుకున్నాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు ఇవ్వడం గమనార్హం.