IPL 2025 : ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. పోరాడి ఓడిన ముంబై
ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో నెగ్గింది. ముంబై ఆఖరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 రన్స్ చేసింది. కోహ్లీ(67), కెప్టెన్ రజత్ పటిదార్(64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జితేశ్ శర్మ(40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 222 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 209 స్కోరుకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(56), హార్దిక్ పాండ్యా(42) పోరాటం వృథా అయ్యింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని నిలువరించారు. కృనాల్ పాండ్యా 4 వికెట్లతో సత్తాచాటగా.. యశ్ దయాల్, హేజల్‌వుడ్ రెండేసి వికెట్లతో రాణించారు. దీంతో టోర్నీలో ఆర్సీబీ మూడో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ దశాబ్దం తర్వాత విజయం సాధించడం గమనార్హం. ఇంతకుముందు 2015లో గెలుపొందింది.