బీరులో గుర్తు తెలియని అవశేషాలు
పాతబస్తీ ఫలక్‌నుమాలోని కోహినూర్ బార్లో కింగ్ ఫిషర్ బీర్లో గర్తు తెలియని అవశేషాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
దిశ, చార్మినార్ : పాతబస్తీ ఫలక్‌నుమాలోని కోహినూర్ బార్లో కింగ్ ఫిషర్ బీర్లో గర్తు తెలియని అవశేషాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కింగ్ ఫిషర్ బీర్లో బల్లి అవశేషాలు అంటూ సోషల్‌మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల లోకి వెళితే... పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన కోహినూర్ బార్లో జనతాకు వేరుగా ఉన్న కౌంటర్ వద్ద ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీరును కొనుగోలు చేశాడు. బీరు తీసుకుని స్నాక్స్ కు ఆర్డర్ చేసి టేబుల్ వద్దకు వచ్చి కూర్చున్నాడు. తీరా బీర్ వైపు చూడగా అందులో గుర్తు తెలియని పీచు లాంటి పదార్థం మాదిరిగా ముక్కలు
ముక్కలుగా తేలుతూ కనిపించడంతో మందు బాబు షాక్‌కు గురయ్యాడు. ఇదేంటి అని బార్ కౌంటర్ వద్దకు వెళ్లి మందుబాబు అడగగా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయని బార్ కౌంటర్లో ఉన్న వ్యక్తి తాపీగా సమాధానమిస్తున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను గమనించిన చార్మినార్ ఎక్సైజ్ అధికారులు వెంటనే ఒక టీంను కోహినూర్ బార్‌కు పంపించారు. ఆ బీరు బాటిల్‌పై మ్యాన్ ఫ్యాక్షరింగ్ డేట్ జూన్ 24 గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బీరులో ఉన్నది బల్లి అవశేషాలా? ఇతర పీచు పదార్థాలా? అది ఒరిజినల్ బీరా? కల్తీ బీరా ? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న సదరు బార్ యాజమాన్యంపై చార్మినార్ ఎక్సైజ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు.