కడప జిల్లాలో విషాదం..ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఇరువురు కుమార్తె, కుమారుడితో కలిసి తల్లి ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలో విషాదం నింపింది.

Update: 2024-04-29 14:17 GMT

దిశ ప్రతినిధి,కడప: కుటుంబ కలహాలతో ఇరువురు కుమార్తె, కుమారుడితో కలిసి తల్లి ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలో విషాదం నింపింది.మండల కేంద్రమైన వల్లూరులో చోటు చేసుకున్న ఈ సంఘటన మృతుల కుటుంబీకులు, పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. చెన్నూరులోని గొర్ల పుల్లయ్య గారి వీధికి చెందిన ఉమామహేశ్వరి (45) కి కడపకు నగరం చలమారెడ్డిపల్లె కు చెందిన ఎద్దుల శ్రీహరితో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు ఫణికుమార్ (17), కుమార్తె ధనలక్ష్మి(18) వున్నారు. శ్రీహరి జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లారు. కువైట్ నుంచి వచ్చిన తర్వాత మద్యానికి బానిసై భార్య, పిల్లలను వేధిస్తూ వుండే వారు. దీంతో తరచూ భార్య భర్తల మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి తన ఇరువురు పిల్లలను తీసుకుని 8 సంవత్సరాల క్రితం తన అన్న ప్రసాద్ ఇంట్లో భర్తకు దూరంగా ఉంటుంది. ఉమామహేశ్వరి భర్త పై భరణం కేసు పెట్టింది. కడపలో కోర్టు చుట్టూ వాయిదాలకు తిరుగుతూ వస్తోంది. ఇరు లాయర్లు ఒక నిర్ణయానికి వచ్చి రూ.8 లక్షలు పంచాయతీ చేసి భార్య కు ఇవ్వాలని లాయర్లు నిర్ణయించారు. భర్త ససేమిరా అంటూ ఏమి చేసుకుంటారో చేసుకోమని జైలుకైనా వెళ్తాను కాని డబ్బులు నా దగ్గర లేవంటూ ఎదురు తిరిగారు. గొడవలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు కేసులతో పాటు భర్తకు దూరమయ్యాననే బాధతో ఆమెకు జీవితంపై విరక్తి ఏర్పడింది. ఈ క్రమంలో ఉమామహేశ్వరి తన కూతురు, కుమారుడుతో కలిసి గుడికి వెళుతున్నామని శనివారం అన్నప్రసాద్‌కు చెప్పి వెళ్లింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉమామహేశ్వరి శనివారం రాత్రి అయినా ఇంటికి రాలేదు.

దీంతో ఉమామహేశ్వరి అన్న ప్రసాద్ ఆదివారం ఉదయం చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సోమవారం వల్లూరు - గంగాయపల్లె మధ్యలో ఉన్న ముళ్ల పొదల్లో ఒక వేప చెట్టుకు తల్లి, కుమారుడు, కూతురు ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని ఆ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గుర్తించారు.సంఘటనా స్థలంలో వారు రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మా చావుకు కారణం భర్త శ్రీహరి, అత్త వై.సరస్వతి, ఆడబిడ్డ శశికళ అని , ఆ ముగ్గురు చావుకు కారణమని ఉమామహేశ్వరి సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వల్లూరు ఎస్.ఐ కె వెంకటరమణ మాట్లాడుతూ ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


Similar News