అస్ట్రేలియాలో విషాదం: ఫిలిప్ దీవిలో మునిగి నలుగురు భారతీయుల మృతి

అస్ట్రేలియాలో విషాద ఘటన జరిగింది. ఆ దేశంలోని విక్టోరియాలో ఉన్న ఫిలిప్ దీవిలో మునిగి నలుగురు భారతీయులు మృతి చెందారు.

Update: 2024-01-25 04:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అస్ట్రేలియాలో విషాద ఘటన జరిగింది. ఆ దేశంలోని విక్టోరియాలో ఉన్న ఫిలిప్ దీవిలో మునిగి నలుగురు భారతీయులు మృతి చెందినట్టు కాన్‌బెర్రాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మరణించిన వారిలో ముగ్గురు మహిళలే ఉన్నారని పేర్కొంది. బుధవారం నలుగురు వ్యక్తులు దీవిలో ముగినినట్టు సమాచారం రాగా..ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ వారిని బయటకు తీశారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20ఏళ్ల మహిళకు తీవ్రగాయాలు కాగా వెంటనే విమానంలో మెల్‌బోర్న్‌లోని ఆల్‌ఫ్రెడ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించి మరణించినట్టు పోలీసులు తెలిపారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. ఫారెస్టు గుహల సమీపంలో సెక్యురిటీ లేని ప్రదేశంలో వీరంతా ఈత కొడుతుండగా ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. బాధిత కుటుంబ సభ్యులతో టచ్ ఉన్నట్టు రాయబార కార్యాలయం తెలిపింది. అయితే వారికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. కాగా, మరణించిన మహిళల్లో ఒకరు పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా ఫగ్వారాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆమె విహారయాత్రకు ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్లినట్టు సమాచారం. 

Tags:    

Similar News