ఆఫ్ఘనిస్తాన్‌లో విషాదం: ల్యాండ్‌మైన్ పేలి 9 మంది చిన్నారులు మృతి
ఆప్ఘనిస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. మందుపాతర పేలిన ఘటనలో 9మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
దిశ,నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. మందుపాతర పేలిన ఘటనలో 9మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. గజ్ని ప్రావిన్స్‌లోని గేరు జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు సమాచార, సాంస్కృతిక శాఖ ప్రాంతీయ అధిపతి హమీదుల్లా నిసార్ వెల్లడించారు. రష్యా దండయాత్ర సమయంలో మిగిలిపోయిన ల్యాండ్ మైన్‌తో పిల్లలు ఆడుకుంటుండగా అది పేలిపోయినట్టు తెలిపారు. మరణించిన వారిలో ఐదుగురు బాలికలు ఉండగా.. నలుగురు బాలురు ఉన్నారు. వీరంతా నాలుగేళ్ల నుంచి పదేళ్ల వయసు వారే కావడం గమనార్హం. గత ఆదివారం కూడా హెరాత్ ప్రావీన్సులో గ్రనేడ్లు పేలడంతో ఓ చిన్నారి మరణించగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా, 1979లో సోవియట్ దండయాత్ర, ఆ తర్వాత దశాబ్దాల తరబడి జరిగిన అంతర్యుద్ధం వల్ల ఆప్ఘనిస్థాన్ అతలాకుతలం అయింది. అంతేగాక పేలని గ్రనేడ్లు, ల్యాండ్ మైన్స్‌తో నిండిపోయింది. ఇవి క్రమం తప్పకుండా పేలుతుండటంతో అనేక మంది మరణిస్తున్నారు.