మారువేషాల్లో చోరీలు
జైల్లో జతకట్టి మారువేషాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబట్ట ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, శంషాబాద్ : జైల్లో జతకట్టి మారువేషాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబట్ట ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 4వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు, జనరల్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒక బైకు,600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గత 4వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ఇంటి తలుపులు, తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడి ఆ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన కేసులో రాజేంద్రనగర్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఈ కేసులో ప్రధాన నిందితుడు మెహిదీపట్నంకు చెందిన గుంజపోగు సుధాకర్ తో పాటు గద్వాల్ కు చెందిన బండారి సాంసంన్, మహారాష్ట్ర పూణెకు చెందిన శనిదేవ్ సాలుంకే, పంజాబ్ రాష్ట్రానికి చెందిన అమర్ జట్ సింగ్, మెహిదీపట్నంకు చెందిన గుంజ పోగు సురేష్ అనే నలుగురు నిందితులను అరెస్టు చేసి విచారించినట్టు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుంజపోగు సుధాకర్ పై దాదాపు 60 కేసులు ఉన్నాయని తెలిపారు. నంద్యాల నుండి నేర చరిత్ర ప్రారంభించాడని, బైక్, ఇంటి చోరీలకు పాల్పడుతూ జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. ఆ జైలులోనే మిగతా నలుగురు పరిచయమై వారితో జతకట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.
ఈ నిందితులు మారువేషాలు ధరించి విగ్గు పెట్టుకొని, పంజాబీ డ్రెస్సులు వేసుకొని, ముఖం సీసీ కెమెరాల్లో కనిపించకుండా మాస్కులు పెట్టుకొని చోరీలకు పాల్పడుతుంటారన్నారు. వీరి ఐదుగురిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, పెట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయన్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లక్ష్మినగర్ కాలనీలో చోరీకి పాల్పడ్డ కేసులో నిందితుల నుండి 600 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ నరసింహ, రాజేంద్రనగర్ ఏసీపీలు శ్రీనివాస్, శంకర్ రెడ్డి, రాజేంద్రనగర్ సీసీఎస్ సీఐ సంజయ్, సీఐ కస్ట్రో, రాజేంద్రనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.