కేక్ తిని పదేళ్ల బాలిక మృతి..బర్త్ డే రోజే విషాదం

పంజాబ్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. బర్త్‌డే సందర్భంగా ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల బాలిక మరణించింది.

Update: 2024-03-31 05:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. బర్త్‌డే సందర్భంగా ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిని పదేళ్ల బాలిక మరణించింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన బాలిక మాల్వీ(10) పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఆన్ లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. అనంతరం సాయంత్రం 7 గంటల టైంలో బాలిక బర్త్ డే వేడుకలు నిర్వహించగా..బాలికతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కేక్ తిన్నారు. అనంతరం అదే రోజు రాత్రి 10గంటలకు కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. బాలిక మాన్వీ సైతం బాగా దాహం అవుతుందని, నోరు ఎండిపోతోందని చెప్పి నిద్ర పోయింది. మరుసటి రోజు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి విషమించి బాలిక మరణించినట్టు ఆమె తాతయ్య హర్బన్ లాల్ తెలిపారు. అయితే చిన్న కుమార్తె వాంతులు చేసుకోవడంతో ప్రాణాలతో బయటపడిందని చెప్పారు.

కేక్‌ను పాటియాలాలోని అదాలత్ బజార్‌లో ఉన్న ‘కేక్ కన్హా’ బేకరీ నుంచి తెప్పించినట్టు తెలుస్తోంది. కేకులో విషపూరిత పదార్థాలు ఉన్నట్టు మాన్వీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బేకరీ యజమానిపై కేసు నమోదు చేశారు. కేకును పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కి పంపించారు. కాగా, బాలిక పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కటింగ్‌లో బాలిక సందడిగా కనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా వేడుకలు జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కుటుంబ సభ్యులు రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News