అనుమానాస్పదంగా యువతి మృతి
దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామంలో అనుమానాస్పదంగా యువతి మృతి చెందడంతో న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ముందు ఆదివారం రాత్రి ధర్నాకు దిగారు.
దిశ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం పుట్టలగడ్డ గ్రామంలో అనుమానాస్పదంగా యువతి మృతి చెందడంతో న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ ముందు ఆదివారం రాత్రి ధర్నాకు దిగారు. దామరచర్ల మండలం మాన్ తండా కు చెందిన భూక్య మౌనిక(20) పుట్టలగడ్డ గ్రామానికి చెందిన నాగులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా శనివారం సాయంత్రం మౌనిక పుట్టల గడ్డకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని నాగును నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తెల్లవారేసరికి మౌనిక పుట్టలగడ్డ గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది.
మౌనిక ఒంటిపై గాయాలు ఉండడంతో నాగుతోపాటు అతని స్నేహితులు కలిసి చంపి ఉరివేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు పెద్ద ఎత్తున ఏరియా ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. దీంతో ఆసుపత్రి ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టూ టౌన్ సీఐ నాగార్జునతో పాటు మిర్యాలగూడ ట్రాఫిక్, వేములపల్లి, మాడుగులపల్లి, వాడపల్లి, టూ టౌన్ ఎస్ఐలు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.