అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ తాళ్లబస్తీలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
దిశ, ముషీరాబాద్ : అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ తాళ్లబస్తీలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కవాడిగూడ తాళ్లబస్తీలో సేరల రేణు బాబు(48), భార్య, ముగ్గురు కొడుకులు నివాసం ఉంటున్నారు. రేణు బాబు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. రోజు మాదిరిగానే ఆటో డ్రైవింగ్ కు వెళ్లిన రేణు బాబు రాత్రికి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి ఎదురుగా ఉన్న అతని స్నేహితుడు అమర్ పిలవడంతో వెళ్లాడు. రేణు బాబు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య పలుమార్లు ఫోన్ చేయగా ఇంటి ఎదురుగానే ఉన్న వస్తున్నానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత రేణు బాబు భార్య తన కొడుకును
పంపించగా ఇంటి ఎదురుగా ఉన్న అమర్ ఇంటి మొదటి అంతస్తులో రేణుబాబుతో పాటు నలుగురు కలిసి మద్యం సేవిస్తున్నారన్న విషయం సాయి పవన్ తన తల్లికి చెప్పాడు. అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత బిల్డింగ్ పైనుంచి ఓ వ్యక్తి కింద పడి ఉన్నాడని సమాచారం తెలవడంతో అక్కడికి వెళ్లి చూడగా తన భర్త రేణుబాబు తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్నాడని, 108 కు ఫోన్ చేయగా సంఘటన స్థలానికి వచ్చిన అంబులెన్స్ వాహనంలో రేణుబాబును గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించాలని పోలీసులు తెలిపారు. తన భర్త రేణు బాబు మృతి పట్ల అనుమానం ఉందని తన భర్తతో మద్యం తాగిన వారిపై కేసు నమోదు చేసి విచారించి న్యాయం
చేయాలని మృతుడి భార్య పోలీసులను కోరారు. రేణుబాబు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని అమర్, బి.చారి, ఎ.వెంకయ్య, ఎన్. పాండు సాగర్, ఎన్.వెంకటేష్ లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీం సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలు, అతనితో మద్యం సేవించిన ఐదుగురిని విచారించిన అనంతరమే వాస్తవం ఏమిటనేది బయటపడుతుందని గాంధీనగర్ పోలీసులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం రేణుబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.