లండన్‌లో ఎమ్మెస్ పూర్తి.. ఉద్యోగంలో చేరేంతలోనే డెంగీతో యువకుడు..
ఉన్నత చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకుడు అనూహ్యంగా డెంగీ బారిన పడి మృతి చెందాడు.
దిశ, మంథని : ఉన్నత చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకుడు అనూహ్యంగా డెంగీ బారిన పడి మృతి చెందాడు. దీంతో మంథనిలో విషాద చాయలు అలుముకున్నాయి. పట్టణానికి చెందిన రావికంటి సాయి చరణ్ (24) బుధవారం సాయంత్రం డెంగ్యూ జ్వరంతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందాడు. గత ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న సాయిచరణ్‌కు స్థానికంగా వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ సాయి చరణ్ మృతి చెందాడు. మంథనికి చెందిన ప్రముఖ వ్యాపారి రావికంటి సదానందం- శారద దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా సాయి చరణ్ చిన్నవాడు. లండన్‌లో ఎమ్మెస్ పూర్తి చేసి మూడు నెలల క్రితం మంథని వచ్చాడు. సోదరుడు సాయి కిరణ్ వివాహ నిశ్చితార్ధం నవంబర్ 3వ తేదీ ఉండగా శుభకార్యంలో పాల్గొని తర్వాత ఉద్యోగంలో చేరాలని సాయి చరణ్ భావించినట్లు బంధువులు తెలిపారు. సాయి చరణ్ మృతి చెందడంతో తల్లిదండ్రులు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.