మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్
గత కొన్ని నెలలుగా జిల్లాలోని పలు పట్టణాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
దిశ, జహీరాబాద్ : గత కొన్ని నెలలుగా జిల్లాలోని పలు పట్టణాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.15 లక్షలు విలువైన 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన నిందితుల్లో రాయికోడ్ మండల్, శంషుద్దీన్ పూర్ కు చెందిన మచ్కూరి వినోద్ కుమార్ అలియాస్ బేగరి రాజు అలియాస్ చింటు, జహీరాబాద్ పట్టణంలోని బాబు మోహన్ కాలనీ చెందిన పెయింటర్ మహమ్మద్ జుబేర్ , పట్టణంలోని శాంతి నగర్ కు చెందిన కూరగాయల వ్యాపారి మహమ్మద్ షఫీ ఉన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. సోమవారం ఉదయం ఎస్ఐ కాశీనాథ్ తన సిబ్బందితో పట్టణంలోని ప్రధాన రహదారిపై పరంపర స్వీట్ హౌస్ ముందు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా మూడు మోటార్ సైకిళ్లపై వెళ్తున్నారు. అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని డాక్యుమెంట్లు అడగగా చూపించలేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు సుమారు ఆరు నెలల నుంచి సంగారెడ్డి , సదాశివపేట, జహీరాబాద్ పట్టణాల్లో 25 మోటార్ సైకిళ్లు , ఒక ఆటో దొంగలించామన్నారు. ఈ మోటార్ సైకిళ్లను తర్వాత అమ్ముకునేందుకు వారు దాచిపెట్టారు. వారి నుంచి 25 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. వాటి విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది. వారిని సోమవారం అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. వీరిని పట్టుకోవడంలో పాల్గొన్న టౌన్ ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అభినందించారు.