అదృశ్యమైన చిన్నారి...చెత్తకుప్పలో శవమై తేలింది
ఐదు రోజుల క్రితం అదృశ్యమైన రాథోడ్ వర్ష(7) అనే చిన్నారి అదే గ్రామంలోని ఓ చెత్తకుప్పలో శవమై కనిపించింది.
దిశ, భైంసా : ఐదు రోజుల క్రితం అదృశ్యమైన రాథోడ్ వర్ష(7) అనే చిన్నారి అదే గ్రామంలోని ఓ చెత్తకుప్పలో శవమై కనిపించింది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి రాగా పోస్టుమార్టం నిమిత్తం శనివారం భైంసా ఏరియా ఆసుపత్రికి చిన్నారి మృతదేహాన్ని తీసుకువచ్చారు. అనంతరం అవయవాలను ఆర్ఎఫ్ఎస్ఎల్ కరీంనగర్, అదిలాబాద్ కేంద్రాలకు పంపించారు. ఇది హత్యా లేక ప్రమాదమా అనే విషయాలు బయటపడితే మరింత సమాచారం వెలుగులోకి వస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని దరసం గ్రామానికి చెందిన రాఠోడ్ రమేష్ కుబీర్ మండలంలోని అంతర్నీ గ్రామంలోని ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూతురు వర్ష 9వ తేదీన గ్రామంలోని వారి ఇంటి వద్ద ఉన్న వినాయక మండపానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో 10న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ఆ చిన్నారి గ్రామంలోని ఓ చెత్తకుప్ప వద్ద మృతి చెంది కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, డాగ్‌స్క్వాడ్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.