ఏసీబీ వలలో మేడ్చల్ జిల్లా అధికారి శ్రీనివాస్ రాజు
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సహకార శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సహకార శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ సిటీ రెంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో బొమ్మల శ్రీనివాస్ రాజు అసిస్టెంట్ (అర్బిట్రెటర్) రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు. నవభారత్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కేసులో ఫిర్యాదుదారు సహాయం చేయాలని అర్బిట్రెటర్ గా ఉన్న శ్రీనివాస్ రాజును కలిసి కోరారు. దీంతో శ్రీనివాస్ రాజు ఫిర్యాదుదారుకు ఫెవర్ చేసేందుకు రూ. 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే తాను 5 లక్షలు లంచం ఇవ్వలేనని, ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇస్తానన్నాడు. ఈ విషయమై ఈ నెల 24వ తేదీన బాధితుడు ఏసీబీ అధికారులను అశ్రయించారు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు లక్ష రూపాయల నగదు తీసుకొని గురువారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. లంచం డబ్బులు తీసుకొని వచ్చానని అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రాజు సమాచారం ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ రాజు తన కారు కలెక్టర్ కార్యాలయం పార్కింగ్ లో ఉందని, అందులో పెట్టాలని సూచించారు. శ్రీనివాస్ రాజు పై అంతస్తు నుంచి కారు డోర్ అన్ లాక్ చేయగా, బాధితుడు కారు ముందు ఢిక్కిలో లక్ష రూపాయలను పెట్టారు. ఆ తర్వాత శ్రీనివాస్ రాజు కారు డోర్ లాక్ చేశారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు శ్రీనివాస్ రాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కారు ఎవరి పేరు మీద ఉందని శ్రీనివాస్ రాజును ప్రశ్నించగా తన అబ్బాయి పేరిట ఉందని ఒప్పుకున్నాడు. కారును ఏసీబీ అధికారులు వీడియో తీశారు. కారులో పెట్టిన డబ్బులు, అందులో ఉన్న పేపర్లపై కెమికల్ పరీక్షలు నిర్వహించారు. నగదు స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ రాజును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.