మహిళా బిల్డర్ ఆత్మహత్యాయత్నం

తీసుకున్న డబ్బులు చెల్లించినా ఇవ్వలేదని వ్యాపారి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, న్యాయం చేయాలని పోలీసులను కోరినా వ్యాపారికే వత్తాసు పలుకుతున్నారని ఓ మహిళా బిల్డర్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

Update: 2024-08-13 15:10 GMT

దిశ, కామారెడ్డి : తీసుకున్న డబ్బులు చెల్లించినా ఇవ్వలేదని వ్యాపారి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, న్యాయం చేయాలని పోలీసులను కోరినా వ్యాపారికే వత్తాసు పలుకుతున్నారని ఓ మహిళా బిల్డర్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఓ మహిళా బిల్డర్ సెల్ఫీ వీడియో ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీలను వేడుకుంది. సెల్ఫీ వీడియోలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ మాట్లాడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీబాయి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తుంది. తనకు డబ్బులు అవసరం ఉండి ఫైనాన్స్ వ్యాపారి విశ్వనాథం వద్ద 32 లక్షలు అప్పుగా తీసుకుంది.

    డబ్బు తీసుకునే సమయంలో సొంత ఇల్లు, రెండు ప్లాట్స్ జీపీఏ చేసింది. అయితే 32 లక్షలకు ఇప్పటివరకు కోటి రూపాయల వరకు చెల్లించానని, అయినా ఇల్లు, ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయింది. తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నాడని, ప్రస్తుతం 56 లక్షలు కడితేనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్తున్నాడని తెలిపింది. రిజిస్ట్రేషన్ అడిగితే ఈ నెల 5న అనుచరులు, మరికొంతమందితో కలిసి తన ఇంటిపై దాడికి వచ్చాడని, 100 కు కాల్ చేస్తే పోలీసులు వచ్చారని తెలిపింది. ఇప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని వాపోయింది. పోలీస్ స్టేషన్ కు వెళ్తే సీఐ రామన్ స్టేషన్ కు రావద్దని చెప్తున్నారని,

    వ్యాపారితో పోలీసులు కలిసిపోయారని ఆరోపించింది. రాజకీయ నాయకులు, బీజేపీ కౌన్సిలర్ తో కలిసి వ్యాపారి విశ్వనాథం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియోలోపేర్కొంది. తనకు భర్త లేడని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను వేడుకుంది. పురుగుల మందు డబ్బా చూపిస్తూ తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. అనంతరం ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

Tags:    

Similar News