మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం..నిండు ప్రాణం బలి

మున్సిపల్ అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం వలన జరిగిన రోడ్డు

Update: 2024-09-14 14:33 GMT

దిశ, వరంగల్ బ్యూరో : మున్సిపల్ అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం వలన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తోరూర్ మండలం లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం...మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటయపాలెం గ్రామానికి చెందిన ఈరబోయిన రమేష్(35). రోజు మాదిరిగానే తన విధుల్లో భాగంగా తొర్రూర్ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి విధులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. అయితే తొర్రూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన చెత్తాచెదారాన్ని కంటయపాలెం గ్రామ శివారులో ఉన్న ప్రైవేటు వ్యక్తి బావి బొందలో ట్రాక్టర్లతో తోలుకు వచ్చి పోస్తూ ఉంటారు.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రం నుంచి తరలిస్తున్న చెత్త చెదారం తో పాటు ఓ పరుపు తోరూర్ కంఠటయపాలెం రహదారిపై పడి ఉంది.

అయితే విధులు పూర్తిచేసుకుని గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్ కు ఓ వాహనం ఎదురు రాగా సైడ్ తీసుకున్న క్రమంలో రోడ్డుపై పడి ఉన్న పరుపుపై కి వెళ్లి పడిపోయారు. తలకు బలమైన గాయం కాగా రక్తస్రావం అవుతుండడంతో 108 వాహనంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.

మృతికి కారణం మున్సిపల్ నిర్లక్ష్యమే..

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వీరబోయిన రమేష్ మృతికి కారణం మున్సిపల్ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యమే అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్, గ్రామ కార్యదర్శి మార్క సాంబయ్య ఆరోపించారు. మున్సిపల్ కి సంబంధించిన చెత్తాచెదారం మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకొని పోసుకోవాల్సి ఉండగా ఇతర ప్రాంతాల్లో పోస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ పై నుండి పడిపోయిన చెత్తాచెదారాన్ని చూసుకోకుండా వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తూ నిరుపేద కుటుంబానికి చెందిన రమేష్ కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అందుకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కనీసం మున్సిపాలిటీకి ప్రత్యేకమైన డంపింగ్ యార్డ్ లేక రహదారుల వెంబడి సమీపంలోని గ్రామాలలో పోయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతునికి భార్య రచన ఇద్దరు కూతుర్లు మాన్విత ఆరాధ్య ఉండగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మల్లయ్య ఐలమ్మ ఉన్నారు. రమేష్ హఠాన్మరణం తో కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉందని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మున్సిపల్ అధికారులపై కేసు నమోదు : జి.ఉపేందర్ ఎస్సై తొర్రూరు

కంటయపాలెం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ వీరబోయిన రమేష్, మృతికి మున్సిపల్ అధికారులే కారణమని రమేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చెత్త తీయడంలో నిర్లక్ష్యం వహించారని అందుకు ఫీల్డ్ అసిస్టెంట్ వీరబోయిన రమేష్ మృతి చెందాలని రమేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.


Similar News