ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌పై చైన్ స్నాచర్ దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలరా..?
చైన్ స్నాచర్లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. గ్రాము బంగారమైనా వదలకుండా కొట్టేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : చైన్ స్నాచర్లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. గ్రాము బంగారమైనా వదలకుండా కొట్టేస్తున్నారు. గతంలో వృద్ధులు, మహిళల మీదనే దాడి చేసి స్నాచింగ్ చేసే ఈ దుండగులు దారి మార్చి పురుషుల మెడలో చైన్లను కూడా చాకచక్యంగా కొట్టేస్తున్నారు. తాజాగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఓ పోలీస్ అధికారి గోల్డ్ చైన్ కొట్టేయబోయి అడ్డంగా బుక్కయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్‌లో ప్రత్యేక విభాగంలో విధులు నిర్వహిస్తున్న వినోద్ బడోలాకు మంచి పేరు ఉంది. అనేక టెర్రరిస్ట్ కార్యకలాపాలను అడ్డుకున్న ఆయన ధైర్య సాహసాలకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి పురస్కారం అందించి సత్కరించింది. పోలీస్ శాఖలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా వినోద్ బడోలా పేరుగాంచారు. కాగా, నిన్న సాయంతం వినోద్ బడోలా వాకింగ్‌కు వెళ్లగా ఇద్దరు చైన్ స్నాచర్లు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను చూసి వెనక నుంచి దాడి చేశారు. కిందపడిపోయిన వినోద్ బడోలా మెడలో ఉన్న బంగారం గొలుసును తెంచుకోని పారిపోతుండగా.. వెంటనే తేరుకున్న ఆయన చైన్ స్నాచర్లలో ఒకరిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించాడు. అతడి ద్వారా తప్పించుకున్న మరో చైన్ స్నాచర్‌ని పట్టుకుని విచారించగా వారి దొంగతనాలన్నీ బయటపడ్డాయి. ఇద్దరి నిందితులుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.