కడప జిల్లాలో తెలంగాణ పోలీసులపై దాడి.. ఎస్ఐ తలకు తీవ్రగాయాలు

వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్య గారి పల్లెల్లో తెలంగాణ పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు.

Update: 2024-02-24 09:11 GMT

దిశ,కడప, ప్రతినిధి: వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్య గారి పల్లెల్లో తెలంగాణ పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐ తలకు గాయాలు కాగా, కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల జీపును ధ్వంసం చేశారు. రెండు రోజులు తర్వాత ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన. మైదుకూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిన్నయ్య గారి పల్లెకు చెందిన కొంతమంది హైదరాబాదులో రూ.50 లక్షలు విలువచేసే గొర్రెలు కొనుగోలు చేసి మైదుకూరు తరలించారు. గొర్రెల డబ్బుల కోసం అనేకమార్లు అడిగినప్పటికీ కొనుగోలుదారు స్పందించక పోవడంతో గొర్రెలు కొనుగోలు చేసి మోసం చేశారని చందానగర్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్లు, ఫిర్యాదుదారుడు చిన్నయ్య గారి పల్లెకు వచ్చారు. వీరిపై చిన్నయ్యగారి పల్లె గ్రామస్తులు శివప్రసాద్ అతని అనుచరులు విచక్షనారహితంగా దాడి చేసి ఎస్సై తో పాటు పోలీసులను కొట్టారు.

ఈ ఘటనలో ఎస్సై తలకు గాయాలు కాగా, కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలు అయ్యాయి. వాహనానంపైనా దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. గాయాలపాలైన తెలంగాణ పోలీసులకు మైదుకూరు పోలీసులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై మైదుకూరు పోలీస్ స్టేషన్లో చందానగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


Similar News