వదినతో కాపురం చేసిన మరిది.. ఇద్దరు పిల్లలు పుట్టాక మొదలైన అసలు కథ!
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బలవంతంగా మరిదితో వదినను అత్తింటివారు కాపురం చేయించారు. చివరకు ఇద్దరు పిల్లలు పుట్టినాక ఇంటినుంచి వెళ్లిపోయేలా టార్చర్ ప్రారంభించారు.
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బలవంతంగా మరిదితో వదినను అత్తింటివారు కాపురం చేయించారు. చివరకు ఇద్దరు పిల్లలు పుట్టినాక ఇంటినుంచి వెళ్లిపోయేలా టార్చర్ ప్రారంభించారు. ఈ విషయమై బాధితురాలు నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన యువకుడికి ఎల్లాయగూడానికి చెందిన యువతితో 2017లో పెళ్లి జరిగింది. పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు రాజుకు పిల్లలు పుట్టడం అసాధ్యం అని తేల్చి చెప్పారు.
దీంతో సదరు యువతి భర్తతో కాపురం చేయలేనని చెప్పి పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజుల తరువాత అత్త, మామ, మరిది యువతి వద్దకు వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చూపిస్తామని చెప్పి కాపురానికి తీసుకొచ్చారు. కానీ ఆ దంపతులను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. మరిదితో కాపురం చేయాలని.. అప్పుడు పిల్లలు పుడతారని ఆమెపై అత్తామామలు ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని ఆసరా చేసుకొని మనం అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఆస్తిపాస్తులు మనమే అనుభవిస్తామని నమ్మబలికిన మరిది వదినతో కాపురం చేస్తూ వస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. ఇన్నాళ్లు గుట్టుచప్పుడుగా సాగిన కాపురం. కొంతకాలంగా అత్తామామ, మరిదిలు తరచూ ఆమెతో గొడవ పడుతూ పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసి కొద్దిరోజుల క్రితం ఆమెపై దాడికి పాల్పడ్డారు.
అనంతరం ఇటీవల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మరిదికి నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలుసుకున్న మహిళ చిన్నతండాకు వచ్చి నిలదీసింది. దీంతో అత్తింటివారు ఆమెను దూషించి వెళ్లగొట్టడంతో నల్లబెల్లి పోలీసులను ఆశ్రయించింది. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు నాలుగు రోజుల క్రితం అందింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. అత్తింటివారిని సైతం విచారించాం. అలాంటిదేం లేదని అంటున్నారు. కేసు విచారణలో భాగంగా అవసరమైతే సంతనానికి డీఎన్‌ఏ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు తీసుకుంటాం’ అని పోలీసులు వెల్లడించారు.