ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం గరిడేపల్లి శివారులో జరిగింది.

Update: 2024-09-15 15:51 GMT

దిశ, గరిడేపల్లి : ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం గరిడేపల్లి శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన కీనరి జీడయ్య(42) తన మోటార్ సైకిల్ పై గరిడేపల్లి నుంచి అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్తుండగా హుజూర్ నగర్ నుంచి వస్తున్న ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనం ఢీకొని జీడయ్య అక్కడికక్కడే చనిపోయాడు.

మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జీడయ్య కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు పోలీస్​స్టేషన్​ వద్ద ఆందోళన చేశారు. మిర్యాలగూడ - కోదాడ ప్రధాన రహదారిపై కుటుంబసభ్యులు రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం నంబర్ ప్లేట్ తొలగించారని, డ్రైవర్​ను ఎక్కడకు పంపించారని బాధితులు, గ్రామస్తులు పోలీసులతో గొడవకు దిగారు. ప్రభుత్వ వాహనం అయితే ఎవరినైనా చంపుకుంటూ పోతారా అని వాగ్వాదానికి దిగారు. వాహనానికి ఉన్న నంబర్ ప్లేట్​ ఎందుకు తొలగించారని బాధితులు ప్రశ్నించారు.

     ఈ సందర్భంగా గరిడేపల్లి ఎస్ఐ నరేష్ బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎస్ఐని నెట్టివేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో గరిడేపల్లి కి చెందిన కొందరు మండల నాయకులు వెంకట్రామాపురం గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వినకపోవటంతో అసహనానికి గురైన పోలీసులు మృతదేహం ఉన్న వాహనాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో హుజూర్​నగర్ సీఐ చరమందరాజు స్పెషల్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను, గ్రామానికి చెందిన నాయకులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పటంతో ఆందోళనకారులు శాంతించారు.

సుమారు 3 గంటలు ఆందోళన

సుమారు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో మిర్యాలగూడ - కోదాడ ప్రధాన రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రాస్తారోకో విరమించిన అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. కాగా చని పోయిన కీసరి జీడయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.  

Tags:    

Similar News