రామమందిర ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్న క్రైస్తవులు.. ఎక్కడంటే ?
దిశ, నేషనల్ బ్యూరో : జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న కాథలిక్ క్రైస్తవ సంఘం కూడా రెడీ అవుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న కాథలిక్ క్రైస్తవ సంఘం కూడా రెడీ అవుతోంది. గంగా-జమునా సంస్కృతిని అద్దంపట్టేలా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠా వేడుకకు వేదికగా నిలిచేందుకు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల ముస్తాబైంది. ప్రయాగ్‌రాజ్‌లోని మైయోరాబాద్, నైని, రాజాపూర్, సివిల్ లైన్స్ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు సోమవారమిక్కడ జరగనున్న ఉత్సవాల్లో పాల్గొననున్నారు. బిషప్ లూయిస్ మస్కరెన్హాస్, సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపాల్ థామస్ కుమార్ చొరవతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రవేశ ద్వారాల వద్ద అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జనవరి 22న కళాశాల ఆవరణలో దీపాలు వెలిగించి శ్రీరాముడిని కీర్తిస్తూ పాటలు పాడనున్నారు. సెయింట్ జోసెఫ్ కళాశాలలో అన్ని మతాల ప్రధాన పండుగలను జరుపుకునే సంప్రదాయం ఉందని ఫాదర్ థామస్ కుమార్ తెలిపారు. ఇక మైయోరాబాద్‌లోని క్రైస్తవ సంఘం సభ్యులు జనవరి 22న తమతమ ఇళ్లలో రామజ్యోతులను వెలిగించనున్నారు.