‘కాస్ట్లీ’ లిక్కర్..ఒక్కరోజే 90 శాతం మద్యం అమ్మకాలు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులు ఎలా ఉన్న మద్యం వ్యాపారానికి మాత్రం కలిసి వచ్చింది. కొద్దిరోజులుగా నిల్వకు ఉన్న మద్యం మొత్తం అమ్ముడుపోయింది. రాష్ట్రంలోని ప్రతి మద్యం దుకాణంలో 90 శాతం స్టాక్ ఒక్కరోజులోనే ఖాళీ చేశారు. లాక్‌డౌన్ ప్రచారం, గత ఏడాది లాక్డౌన్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మందుబాబులు ఇంట్లోనే స్టాక్ పెట్టుకున్నారు. కొంతమంది రెండు వారాలు, మరికొంతమంది ఏకంగా నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో మంగళవారం ఒక్కరోజే […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులు ఎలా ఉన్న మద్యం వ్యాపారానికి మాత్రం కలిసి వచ్చింది. కొద్దిరోజులుగా నిల్వకు ఉన్న మద్యం మొత్తం అమ్ముడుపోయింది. రాష్ట్రంలోని ప్రతి మద్యం దుకాణంలో 90 శాతం స్టాక్ ఒక్కరోజులోనే ఖాళీ చేశారు. లాక్‌డౌన్ ప్రచారం, గత ఏడాది లాక్డౌన్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మందుబాబులు ఇంట్లోనే స్టాక్ పెట్టుకున్నారు. కొంతమంది రెండు వారాలు, మరికొంతమంది ఏకంగా నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో మంగళవారం ఒక్కరోజే దాదాపు రూ. 250 కోట్ల లిక్కర్ సేల్ అయింది.
ఒక్కరోజే రూ. 250 కోట్లు
రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. మందుబాబులు మొత్తం వైన్ షాపులకు పరుగులు తీశారు. ఒక్కో మద్యం దుకాణం దగ్గర వేలాది మంది కొనుగోళ్లకు నిలబడ్డారు. ఒక దశలో కొన్నిచోట్ల దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో దుకాణాల్లో కేవలం గంటల వ్యవధిలోనే స్టాక్ మొత్తం అమ్ముడయింది. అవసరాలకు మించి మద్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల లాక్ ప్రకటించడంతో నెల రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసుకుననారు.
గ్రేటర్లోనే అధికం
రాష్ట్రంలో మొత్తం 2210 మద్యం దుకాణాలు ఉండగా… మంగళవారం 2197 దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే ఇటీవల రాత్రి 8 గంటల వరకే కొనుగోళ్లు నిలిపివేస్తుండటంతో కొంత గిరాకీ తగ్గింది. ఇదే సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయం మంగళవారం ప్రకటించింది. దీనికి తోడుగా గత ఏడాది కూడా లాక్‌డౌన్ విధించడంతో మందు బాబుల అవస్థలు చెప్పలేనివి. ఇలాంటి పరిస్థితులను ఊహించిన వారంతా మందు కోసం ఎగబడ్డారు. అయితే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వెసలుబాటు కల్పిస్తున్నట్లు చెప్పినా మద్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు రూ. 120కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
మొత్తం రాష్ట్రంలో రూ. 250 కోట్ల విక్రయాలు జరిగినట్లు అధికారులు చెప్పుతున్నారు.
అదేవిధంగా ఏపీ సరిహద్దులో కూడా మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగాయి. అటు సూర్యాపేట, కోదాడ, ఇటు అలంపూర్, గద్వాల ప్రాంతాల్లోని దుకాణాల్లో పదింతల విక్రయాలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ ప్రాంతాల్లో మద్యం ఎక్కువగా అమ్ముడు పోయిందని చెప్పుతున్నారు.
సగటు విక్రయాలు దాటాయి
రాష్ట్రంలో మద్యం విక్రయాలు సగటు శాతాన్ని దాటిపోయాయి. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో రూ. 2,269.67 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. ఈ లెక్కన రోజుకు సగటున రూ. 75 కోట్లు అమ్మారు. అదే విధంగా ఈ నెల పదిరోజులో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే రోజుకు సుమారు రూ.61 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి. అయితే మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ. 250 కోట్లకుపైగా అమ్మకాలు జరుగడం చూస్తే విక్రయాలు అర్థమవుతున్నాయి. మరోవైపు బుధవారం లిక్కర్ సేల్ గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో రూ. 26 కోట్లు దాటలేదని అధికారులు చెప్పుతున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటలకే దుకాణాలు తెరవడం, అంతకు ముందే సరిపడే విధంగా కొనుగోలు చేయడంతో ఈ పది రోజులూ లిక్కర్ దుకాణాలకు పెద్దగా గిరాకీ ఉండదంటున్నారు.