గ్లాండ్‌ఫార్మా ఐపీవోలో చిక్కులు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా ఐపీవోకు సంబంధించిన చిక్కులు ఎదుర్కొంటోంది. ఇటీవల ఐపీవోకు వెళ్లాలనే ప్రయత్నాల్లో సెబీకి దరఖాస్తు చేసుకుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడం ద్వారా దాదాపు రూ. 3 వేల కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, కంపెనీ మెజారిటీ వాటా చైనాకు చెందిన కంపెనీకి ఉండటంతో అడ్డంకులు ఏర్పడతాయేమోనని భావిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా పెట్టుబడులు అధికంగా ఉన్న భారత కంపెనీకి సెబీ […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా ఐపీవోకు సంబంధించిన చిక్కులు ఎదుర్కొంటోంది. ఇటీవల ఐపీవోకు వెళ్లాలనే ప్రయత్నాల్లో సెబీకి దరఖాస్తు చేసుకుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడం ద్వారా దాదాపు రూ. 3 వేల కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, కంపెనీ మెజారిటీ వాటా చైనాకు చెందిన కంపెనీకి ఉండటంతో అడ్డంకులు ఏర్పడతాయేమోనని భావిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా పెట్టుబడులు అధికంగా ఉన్న భారత కంపెనీకి సెబీ అనుమతి ఇస్తుందా లేదా అనే సందేహం కంపెనీని వెంటాడుతోంది. చైనాకు చెందిన ఫోసున్ ఫార్మా కంపెనీ 2017లో గ్లాండ్‌ఫార్మాలో సుమారు రూ. 7,700 కోట్ల విలువైన పెట్టుబడులను పెట్టింది. ఈ పెట్టుబడి ద్వారా గ్లాండ్‌ఫార్మా కంపెనీలో 74 శాతం వాటాను దక్కించుకుంది. షాంఘై ఫోసున్ ఫార్మాస్యూటికల్ గ్రూప్, సింగపూర్‌లో ఉన్న తన అనుబంధ సంస్థ ఫోసు ద్వారా ఈ పెట్టుబడులను పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక, గ్లాండ్ ఫార్మా మొత్తం రూ. 3 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ కోసం 3.48 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇందులో ఫోసున్ ఫార్మాకు చెందిన 1.93 కోట్ల షేర్లు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి ఐపీవో ద్వారా రూ 1,250 కోట్ల నిధులు మాత్రమే సమీకరించనున్నట్లు సమాచారం. అన్ని సానుకూలంగా మారి ఐపీవో విజయవంతమైతే గ్లాండ్ ఫార్మాలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం పెరగనుంది. గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు స్థాపించారు. మొదట్లో చిన్న కాంత్రాక్ట్ మ్యానుఫక్చరింగ్ కంపెనీగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఎదిగి ప్రముఖ ఫార్మా కంపెనీగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గ్లాండ్ ఫార్మా యూరప్, యూఎస్, కెనడా లాంటి పెద్ద దేశాలకు సైతం ఔషధాలను ఎగుమతి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు కంపెనీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చే నిధులను సాధారణ కార్పొరేట్ మూలధన నిర్వహణకు, ఆర్అండ్‌డీతో పాటు కంపెనీ విస్తరణ కోసం వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.