500 ఎకరాల దేవుడి భూమి స్వాహా

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లాలో ఆ శాఖకు మొత్తం 3254 ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారు 500 ఎకరాల ల్యాండ్ అన్యాక్రాంతమైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. ఏండ్ల క్రితం కబ్జా అయిన ఈ భూములకు నేడు విలువ పెరిగి ఎకరాకు కోట్లలో ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన భూ వివరాలు సమగ్రంగా సేకరించాలని ఆ శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో కబ్జాకు […]

Update: 2020-06-02 00:00 GMT

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. జిల్లాలో ఆ శాఖకు మొత్తం 3254 ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారు 500 ఎకరాల ల్యాండ్ అన్యాక్రాంతమైనట్లు ఎండోమెంట్ అధికారులు గుర్తించారు. ఏండ్ల క్రితం కబ్జా అయిన ఈ భూములకు నేడు విలువ పెరిగి ఎకరాకు కోట్లలో ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన భూ వివరాలు సమగ్రంగా సేకరించాలని ఆ శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో కబ్జాకు గురైన భూ వివరాలను గుర్తించి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు.

ఆక్రమణలకు గురైన భూములివే..

వికారాబాద్ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి 3254 ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారు 500 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు అధికారులు గుర్తించారు. దేవాలయ భూములు, మాన్యాల కబ్జాలపై ప్రశ్నించిన తమపై ఆక్రమణదారులు దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కబ్జాకు గురైన భూముల వివరాలను అధికారులు బహిర్గతం చేశారు. తాండూర్‌లోని సర్వే నంబర్ 37లో 5.27 ఎకరాలు, కోతులపూర్ సర్వే నంబర్ 22, 23లో 3.36 ఎకరాలు, మల్‌రెడ్డిపల్లి‌లోని 52, 126 సర్వే నంబర్‌లో 5.20 ఎకరాలు, పరిగి మండలం రావులపల్లి గ్రామంలో సర్వే నంబర్ 57లో 2.33 ఎకరాలు, పరిగి గ్రామంలో సర్వే నంబర్ 48లో 13.21 ఎకరాలు, కుల్కచర్ల మండలం ఇప్పయిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 61లో 1.10 ఎకరాలు, దోమ మండలం మోత్కూర్ గ్రామంలో సర్వే నంబర్ 489, 579, 586, 779లో 9.42 ఎకరాలు, బ్రాహ్మణ‌పల్లి‌లోని 1,2,3, 134, 95 సర్వే‌లో 5 ఎకరాలు, పెద్దేముల్ మండలం జనగామ గ్రామంలో సర్వే నంబర్ 6,171లో 10.59 ఎకరాలు, మంచన్‌పల్లి సర్వే నంబర్ 27లో 2.14 ఎకరాలు, పూడూర్ మండలం ఎన్కెపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 119లో 20.3 ఎకరాలు, ఎన్కేపల్లి‌లోని 24, 25 సర్వే నంబర్లో 6.30 ఎకరాలు, చెన్‌గోముల్ గ్రామంలోని సర్వే నంబర్ 220,464లో 10.28 ఎకరాలు, ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 78, 79లో 5.58 ఎకరాలు, బషీరాబాద్ మండలం నావంగి గ్రామంలోని సర్వే నంబర్ 204లో 6.13 ఎకరాలు, గూడూరులోని సర్వే నంబర్ 111లో 11.1 ఎకరాలు, మోమిన్‌పేట్ మండలంలోని సర్వే నంబర్ 430లో 2 ఎకరాలు, బంట్వారం మండలం ముచారంలోని సర్వే నంబర్ 63లో 4.9 ఎకరాలు, తోరు‌మామిడిలోని సర్వే నంబర్ 280, 292, 356, 357, 358లో 40 ఎకరాలు, యాలాల్ మండలం అగ్గనూర్ గ్రామంలోని సర్వే నంబర్ 72, 78లోని 33.28 ఎకరాలు, వికారాబాద్ గరిగిట్ట‌పల్లిలోని రంగనాయక ఆలయానికి సంబంధించిన 33 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది.

ధ్వంసమవుతున్న ఆలయాలు

ఒకప్పుడు ఆలయాలు ధూపదీప నైవేద్యాలతో కళకళలాడేవి. ఇప్పుడు అవి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొంతమంది గుప్తనిధుల కోసం విగ్రహాలు, గోపురాలను తొలిచి వేశారు. స్థానిక నాయకులు, వారి అనుచరులు దేవస్థానాల భూములను కబ్జాలు చేసేశారు. కానీ దేవాలయాల అభివృద్ధిని గాలి కొదిలేశారు. ఉదాహరణకు వికారాబాద్ మండలం గరిటిపల్లి గ్రామంలో రంగనాయక ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన 33 ఎకరాల భూమి కొన్నేండ్ల క్రితమే అన్యాక్రాంతమైంది. ఈ ఆలయ పూజారిపై అక్రమార్కులు దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అంతకుముందు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలను సైతం నిర్వహించే వారు. కానీ ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదని చూపిస్తూ ఉత్సవాలు చేయడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా గ్రామాల్లోని దేవాదాయ భూములను ఆక్రమించుకొని దేవాలయాలను నాశనం చేస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత స్వాధీనం: సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్

ఆక్రమణకు గురైన దేవాదాయ భూములను లాక్‌డౌన్ తర్వాత స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో కబ్జాకు గురైన భూముల వివరాలు సేకరించాం. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశాం. ఈ భూములన్నీ వేలం వేసి దేవాలయాల అభివృద్ధి, అర్చకులకు వేతనాలు, ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తాం.

Tags:    

Similar News