టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. శాయంపేట స‌ర్పంచుల సంచ‌ల‌న నిర్ణయం!

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో 22 మంది టీఆర్ఎస్ స‌ర్పంచులు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతుండటం సంచ‌ల‌నం రేపుతోంది. గ‌త కొంత‌కాలంగా ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జెడ్పీ చైర్‌ప‌ర్సన్ గండ్ర జ్యోతి త‌మను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, దీనికి తోడు స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధిప‌త్యం ఎక్కువ‌వుతోంద‌న్న ఆగ్రహంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. పార్టీలో గౌర‌వం, ప్రాధాన్యం లేన‌ప్పుడు ఉండి ఏం ఉపయోగం అని అసహనంతో ఉన్నట్లు […]

Update: 2021-11-21 07:16 GMT

దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో 22 మంది టీఆర్ఎస్ స‌ర్పంచులు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతుండటం సంచ‌ల‌నం రేపుతోంది. గ‌త కొంత‌కాలంగా ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జెడ్పీ చైర్‌ప‌ర్సన్ గండ్ర జ్యోతి త‌మను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, దీనికి తోడు స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధిప‌త్యం ఎక్కువ‌వుతోంద‌న్న ఆగ్రహంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం. పార్టీలో గౌర‌వం, ప్రాధాన్యం లేన‌ప్పుడు ఉండి ఏం ఉపయోగం అని అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం ‘దిశ’కు తెలిసింది. మండల నేతలను, ప్రజాప్రతినిధులకు సమన్యాయం చేయాల్సిన పెద్దలే త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అభిప్రాయంతో ఉన్న సర్పంచులు పార్టీకి రాజీనామా చేసి త‌మ దారి తాము చూసుకోవాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం. ఏదైనా మూకుమ్మడి నిర్ణయంతోనే ఫ‌లితం ఉంటుంద‌నే అభిప్రాయంతో సామూహికంగా పార్టీకి రాజీనామాలు చేయాల‌నే ఆలోచ‌న‌తో ఆదివారం ర‌హ‌స్యంగా మండ‌లంలోని ఓ గ్రామ స‌ర్పంచ్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.

22 మంది స‌ర్పంచుల భేటీ..

మండ‌లంలో 24 మంది స‌ర్పంచులుండ‌గా… 23 మంది స‌ర్పంచులు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారు. ఒకరు బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధి ఉన్నారు. తాజాగా.. 22 మంది స‌ర్పంచులు పార్టీ వీడేందుకు సమావేశం కావ‌డం భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం, హ‌న్మకొండ జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భేటీలో పాల్గొన్న స‌ర్పంచుల్లోని కొంత‌మంది ‘దిశ‌’కు అందించిన స‌మాచారం ప్రకారం.. స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్, ఎంపీపీ వైఖరిపై కొద్దిరోజులుగా స‌ర్పంచులు నిర‌స‌న గ‌ళం వినిపించిన‌ట్లు స‌మాచారం. త‌మ స‌మ‌స్యల‌పై, గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే గాని, జెడ్పీ చైర్‌ప‌ర్సన్‌ గాని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఎంపీపీ పెత్తనం ఎక్కువైంద‌నంటూ కాసింత ఘాటూగానే స‌ర్పంచుల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలిసింది. అధికార పార్టీ సర్పంచులే అయిన‌ప్పటికీ నాయ‌క‌త్వ నిర్లక్ష్య ధోరణితో అవ‌మానాల‌కు గుర‌వాల్సి వ‌స్తోందంటూ స‌మావేశంలో పలువురు సర్పంచులు మనోవేదన చెందిన‌ట్లు తెలుస్తోంది. ఎంపీపీ ఆధిపత్యం శ్రుతి మించడం, గండ్ర దంపతులు సైతం ఎంపీపీకి వత్తాసు పలుకడమే ఇందుకు కారణమని వారు తెలిపినట్లు సమాచారం.

వేడెక్కిన రాజ‌కీయం..

గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గండ్ర సత్యనారాయణ రావు వ్యూహరచన చేస్తో్న్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అసంతృప్తితో ఉన్న పలువురు సర్పంచులతో ఇటీవల మంతనాలు జరిపినట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచుల రాజీనామా అంశం తెరపైకి రావడంతో గండ్ర సత్యనారాయణ రావు వ్యూహం ఫలించినట్లే ఉందని రాజకీయ విశ్లేషణలు తెలుపుతున్నాయి. మండల వ్యాప్తంగా గండ్ర సత్యనారాయణకు బలమైన క్యాడర్‌తో పాటు విస్తృత ప్రజా సంబంధాలు ఉన్నాయి. సర్పంచులు గనుక సత్యనారాయణరావు వైపు మొగ్గుచూపినట్లైతే మండలంలో టీఆర్ఎస్ పార్టీకి సంకట స్థితి తప్పదని స్థానికంగా చర్చలు సాగటం గమనార్హం.

Tags:    

Similar News