ICC World Cup 2023: రేప‌టి నుంచే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ సమరం.. ఫ‌స్ట్ ఫైట్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ 'ఢీ'

ICC World Cup 2023కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.

Update: 2023-10-04 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. రేప‌టి (అక్టోబర్ 5) నుంచే వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ ఢీకొట్టనున్నది. అహ్మాదాబాద్ వేదిక‌గా జర‌గ‌నున్నది. ఇంగ్లండ్ త‌న టైటిల్‌ను నిల‌బెట్టుకునేందుకు పోరాటం చేయ‌నున్నది. గాయాల‌తో స‌త‌మ‌తం అవుతున్న న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్‌లో గెల‌వాల‌న్న పట్టుద‌ల‌తో ఉంది. 2019లో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఈ రెండు జ‌ట్లే త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌, బౌల‌ర్ టిమ్ సౌథీలు జ‌ట్టుకు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ఇద్దరూ ప్రస్తుతం గాయాల‌తో ఇబ్బందిప‌డుతున్నారు. మ‌రో వైపు ఇంగ్లండ్ జ‌ట్టు మాత్రం మేటి బ్యాట‌ర్లతో బ‌లంగా క‌నిపిస్తోంది. బెన్ స్టోక్స్‌తో పాటు జోస్ బ‌ట్లర్‌, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, జో రూట్‌, డేవిడ్ మ‌లాన్, హ్యారీ బ్రూక్‌ లాంటి హిట్టర్లు ఆ జ‌ట్టులో ఉన్నారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉన్న ఇంగ్లండ్ ఆట‌గాళ్లకు ఇండియా పిచ్‌లు మ‌రింత అనుకూలించే అవ‌కాశాలు ఉన్నాయి. మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌, సామ్ క‌ర్రన్ లాంటి ఆల్‌రౌండ‌ర్లు కూడా ఆ జ‌ట్టుకు బ‌లాన్నివ్వనున్నారు.

2015, 2019 వ‌న్డే టోర్నీల్లో న్యూజిలాండ్ జ‌ట్టు ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. టాప్ ఆర్డర్‌లో డారిల్ మిచ‌ల్‌, డేవ‌న్ కాన్వేలు మంచి ఫామ్‌లో ఉండటం న్యూజిలాండ్‌కు అనకూలించే అంశం. ఈ ఇద్దరి కాన్ఫిడెన్స్ కీల‌కం కానున్నది. స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా టామ్ లాథ‌న్ బాధ్యత‌లు చేప‌ట్టనున్నాడు. జేమ్స్ నీషామ్‌, గ్లెన్ ఫిలిప్స్ లాంటి హార్డ్ హిట్టింగ్ బ్యాట‌ర్లు కూడా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బౌల్ట్ ఫామ్‌లోకి రావ‌డం కివీస్‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మే.


Similar News