ICC World Cup 2023: షమీ vs శార్దూల్.. పాకిస్తాన్ మ్యాచ్‌లో చోటెవరికి?

క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రేపే.

Update: 2023-10-12 13:39 GMT

న్యూఢిల్లీ : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ టీమ్స్ అహ్మదాబాద్ వేదికగా శనివారం ఢీకొట్టబోతున్నాయి. వరుసగా రెండు విజయాలతో టీమ్ ఇండియా ఫుల్ జోష్‌లో ఉన్నది. అయితే, పాక్‌తో తలపడే జట్టుపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చే ఉంటుంది. అయితే, ఒక్క స్థానం మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు తలనొప్పిగా మారింది. ఆ స్థానమే నం.8. ఆ స్థానం కోసం పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్ మహ్మద్ షమీ పోటీపడుతున్నారు. ఈ స్థానంలో ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలా? లేదా బౌలర్‌ను తీసుకోవాలా? అన్న దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతున్నది. పేస్ దళంలో బుమ్రా, సిరాజ్ ప్రధాన పేసర్లు ఉండటంతో ప్రపంచకప్‌లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

అయితే, పాక్‌తో పోరులో అతను వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాటింగ్ పరంగా భారత జట్టు పటిష్టంగా ఉంది. మరోవైపు, పాక్ బ్యాటింగ్ దళం కూడా బలంగా కనిపిస్తుండటంతో టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు బౌలర్ వైపు మొగ్గు చూపొచ్చు. అదే జరిగితే షమీకి చోటు ఖాయమే. పాక్‌పై మూడు వన్డేలు ఆడిన అతను.. 5 వికెట్లు పడగొట్టగా.. ఓ మ్యాచ్‌లో 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. అలాగే, ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున షమీ 28 వికెట్లు తీయగా.. అందులో అహ్మదాబాద్‌లోనే 17 వికెట్లు తీశాడు. మరోవైపు, టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రం పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌‌ను తీసుకోవచ్చు.

ఆసిస్‌తో మ్యాచ్‌కు శార్దూల్ బెంచ్‌కే పరిమితమవ్వగా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కింది. 6 ఓవర్లు వేసిన అతను ఒక వికెట్ తీసి 31 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. శార్దూల్ బ్యాటింగ్ చేసిన చివరి 10 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. అత్యధిక స్కోరు 25 మాత్రమే. ఆసియా కప్‌లో పాక్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 3, 11 పరుగులు చేశాడు. ఈ లెక్కన అతను బ్యాటుతో పెద్దగా టచ్‌ లేడని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో బ్యాటింగ్ పరంగా టీమ్ ఇండియాకు ఢోకా లేదని.. బౌలర్‌నే తీసుకోవాలని సూచిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

శార్దూల్ 20 బంతుల్లో 45 పరుగులు చేసే ఆటగాడు కాదని, కాబట్టి, షమీని తీసుకోవాలని చెప్పాడు. మరోవైపు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ స్థానం కోసం పోటీపడుతున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ కాస్త స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో అశ్విన్‌కు కూడా తుది జట్టులో అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ సామరథ్యం కూడా అతని ఎంపికకు అదనపు బలమే. ఆసిస్‌తో తొలి మ్యాచ్ ఆడిన అతను ఒక వికెట్ తీశాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరి, పాకిస్తాన్‌తో పోరులో ఎవరికి తుది జట్టులో అవకాశం దక్కుతుందో వేచి చూడాలి.


Similar News