ఫస్ట్ ఒరిజినల్.. తర్వాత నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా అరెస్ట్
దిశ, చౌటుప్పల్: అమాయకులకు నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ఆగడాలను చౌటుప్పల్ పోలీసులు, రాచకొండ ఎస్ ఓటీ పోలీసులు సంయుక్తంగా గుట్టు రట్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం చౌటుప్పల్ మండల పరిధిలోని చిన్న కొండూరు గ్రామానికి చెందిన తీగుళ్ల యాదయ్య అనే వ్యక్తికి ఆగస్టు 8న తెలియని ఒక వ్యక్తి అతనికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాను జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నానని, తవ్వకాలలో తమకు భారీ ఎత్తున బంగారం దొరికిందని.. ఈ […]
దిశ, చౌటుప్పల్: అమాయకులకు నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ఆగడాలను చౌటుప్పల్ పోలీసులు, రాచకొండ ఎస్ ఓటీ పోలీసులు సంయుక్తంగా గుట్టు రట్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం చౌటుప్పల్ మండల పరిధిలోని చిన్న కొండూరు గ్రామానికి చెందిన తీగుళ్ల యాదయ్య అనే వ్యక్తికి ఆగస్టు 8న తెలియని ఒక వ్యక్తి అతనికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాను జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నానని, తవ్వకాలలో తమకు భారీ ఎత్తున బంగారం దొరికిందని.. ఈ విషయం తన యజమానికి తెలియదంటూ నమ్మబలికాడు. ఆ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని పలుమార్లు యాదయ్య కు ఫోన్ చేయగా వారి మాటలు నమ్మిన యాదయ్య ఆగస్టు 24న హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో వారిని కలిశాడు. ఈ సందర్భంలో యాదయ్యను నమ్మించడానికి వారు మూడు గ్రాముల అసలు బంగారాన్ని ముట్ట చెప్పారు. అప్పటికి అనుమానం ఉన్న యాదయ్య ఆ బంగారాన్ని చౌటుప్పల్ లోని జ్యువెలరీ షాప్ లో తనిఖీ చేయించగా స్వచ్ఛమైన బంగారం అని చెప్పారు. దీంతో వారిపై నమ్మకం ఏర్పడడంతో అదే నెల 29న అనంతపూర్ కు చెందిన గువ్వల సుదేష్ కుమార్(37), కర్ణాటకకు చెందిన ఆర్. వంశీ(20), ఈశ్వర్ రెడ్డి లు ఓ కారులో వచ్చి మూడు కేజీల బంగారాన్ని 12 లక్షల రూపాయలకు యాదయ్యకు విక్రయించారు.
యాదయ్య కొనుగోలు చేసిన మూడు కేజీల బంగారాన్ని జ్యువెలరీ షాప్ లో తనిఖీ చేయించగా నకిలీ బంగారం అని తేలడంతో లబోదిబోమంటూ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెప్టెంబర్ 13 నుంచి నిందితుల కోసం గాలిస్తున్నారు. శుక్రవారం ఉదయం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను గవ్వల సుదేష్ కుమార్, ఆర్.వంశీ లుగా గుర్తించారు. వారిని తనదైన శైలిలో విచారణ నిర్వహించగా అసలు విషయం బట్టబయలైంది. గత కొన్ని రోజులుగా ప్లాస్టిక్ పువ్వులు, పక్షులను అమ్ముతున్నట్లుగా గ్రామాలలో తిరుగుతూ అమాయకులైన ప్రజలను టార్గెట్ చేస్తూ వారితో స్నేహం పెంచుకుంటున్నారని, అనంతరం వారి ఫోన్ నెంబర్లు సంపాదించి ఇలా వారిని మోసం చేస్తున్నారని విచారణలో తేలింది. ఇద్దరు నిందితుల నుండి రూ.19,4500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, డీసీపీ కె. నారాయణ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి, రాచకొండ ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించినట్లు ఎస్సై నాగిరెడ్డి తెలిపారు.