కరెంట్ ‘పీక్’.. రికార్డు బ్రేక్

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ వినియోగంలో రోజుకో కొత్త రికార్డు బద్దలవుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు రాష్ట్రంలో పీక్ డిమాండ్ 13,009 మెగావాట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజున నమోదైన పీక్ విద్యుత్ వినియోగం 9,837 మెగావాట్లతో పోలిస్తే ఇది 3,172 మెగావాట్లు అధికం. దీంతో ఈ సంవత్సరం ఇదే నెలలో 17, 19వ తేదీలలో నమోదైన కొత్త పీక్ డిమాండ్లు 12,137, 12,936 మెగావాట్ల రికార్డు చెరిగిపోయినట్లైంది. రోజులో ఏదో ఒక […]

Update: 2020-02-25 08:14 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ వినియోగంలో రోజుకో కొత్త రికార్డు బద్దలవుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు రాష్ట్రంలో పీక్ డిమాండ్ 13,009 మెగావాట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజున నమోదైన పీక్ విద్యుత్ వినియోగం 9,837 మెగావాట్లతో పోలిస్తే ఇది 3,172 మెగావాట్లు అధికం. దీంతో ఈ సంవత్సరం ఇదే నెలలో 17, 19వ తేదీలలో నమోదైన కొత్త పీక్ డిమాండ్లు 12,137, 12,936 మెగావాట్ల రికార్డు చెరిగిపోయినట్లైంది. రోజులో ఏదో ఒక సమయంలో ఇప్పటివరకు లేనంత గరిష్ట డిమాండ్ నమోదైతే దానిని కొత్త పీక్ డిమాండు రికార్డుగా పరిగణిస్తారు. ఆ రోజులోని వివిధ సమయాల్లో నమోదైన డిమాండ్ల సగటును ఆ రోజు మొత్తం సగటు విద్యుత్ డిమాండ్‌గా వ్యవహరిస్తారు. మంగళవారం ఉదయం నమోదైన 13,009 మెగావాట్ల పీక్ డిమాండ్‌లో రాష్ట్రంలోని ఉత్తర డిస్కం టీఎస్ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 5606 మెగావాట్లు నమోదుకాగా, దక్షిణ డిస్కం పరిధిలో 6,975 మోగావాట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజున టీఎస్ఎన్‌పీడీసీఎల్‌లో 3,328 మెగావాట్ల విద్యుత్ నమోదుకాగా టీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 6,302 మెగావాట్ల డిమాండ్ విద్యుత్ నమోదైంది. అంటే ఒక్క ఉత్తర తెలంగాణ డిస్కం టీఎన్‌పీడీసీఎల్ పరిధిలోనే 50 శాతానికిపైగా డిమాండ్ పెరిగి 1,978 మెగావాట్ల రికార్డు నమోదైంది. టీఎస్‌పీడీసీఎల్ పరిధిలో మాత్రం 673 డిమాండ్ల వృద్ధి మాత్రమే నమోదైంది.

కాళేశ్వరం లిఫ్టులే కారణం
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్టుల ట్రయల్ రన్ ఈ నెలలోనే పూర్తి స్థాయిగా ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగమైన అన్ని బ్యారేజీల వద్ద భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోస్తూ ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని ప్రధాన బ్యారేజీలు, పంపుహౌసులు ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ ఆకాశన్నంటుతోంది. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ వ్యత్యాసంలో 50 శాతం వృద్ధి అనేది సాధారణ పరిస్థితుల్లో నమోదు కాదు. ఉత్తర తెలంగాణలోని భారీ ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టులైన కాళేశ్వరం, దేవాదుల లిఫ్టులను ఏకకాలంలో నడుపుతుండడం వల్లే విద్యుత్ వినియోగంలో సరికొత్త గరిష్ట వినియోగ రికార్డులు నమోదవుతున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యంగా పడడం, గ్రౌండ్ వాటర్ సమృద్ధిగా పెరగడంతో రాష్ట్రంలో రైతాంగమంతా రబీలో గరిష్టంగా పంటలు సాగు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కువ భాగం వ్యవసాయం బోర్ల మీదే ఆధారపడడంతో వ్యవసాయ రంగం నుంచి విద్యుత్ డిమాండ్ కూడా పెరిగనట్లు తెలుస్తోంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులుండడం, ఇక్కడే వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉండడంతో ఈ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇక చలికాలం ముగిసీముగియగానే ఈసారి పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా ఉంటుండడంతో గృహ వినియోగమూ ఓ మోస్తరుగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరమున్న తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ టీఎస్పీడీసీఎల్‌ పరిధిలోనూ 600 మెగావాట్ల వృద్ధి నమోదవుతోంది.

Tags:    

Similar News