అఫ్ఘాన్ లో యుద్ధానికి తెరదించనున్న అమెరికా.. ఆ తేదీన ముహుర్తం

by Shamantha N |   ( Updated:2021-05-17 02:50:41.0  )
అఫ్ఘాన్ లో యుద్ధానికి తెరదించనున్న అమెరికా.. ఆ తేదీన ముహుర్తం
X

కాబూల్ : అఫ్ఘనిస్తాన్‌లో దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి అమెరికా తెరదించనుంది. అయితే ఇందుకు సంబంధించిన బలగాల ఉపసంహరణ ప్రక్రియ మాత్రం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. తాలిబన్లతో శాంతి చర్చల ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి యూఎస్‌కు చెందిన బలగాల ఉపసంహరణకు యూఎస్ కొత్త డెడ్‌లైన్ విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11 న అందుకు ముహుర్తం సిద్ధం చేసింది. వైట్‌హౌస్ లోని అత్యున్నత స్థాయి వర్గాలు ఇప్పటికే దీనిని ధృవీకరించాయి. ఇదే విషయం మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడించనున్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ ఏడాది మే లోనే యూఎస్ బలగాలు అఫ్ఘాన్‌ నుంచి వెళ్లాల్సి ఉన్నా అందుకు సంబంధించిన ప్రక్రియ మరింత ఆలస్యమైంది. తాజాగా విధించిన డెడ్‌లైన్ అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యుటీసీ) ను కూల్చివేసిన (2001 సెప్టెంబర్ 11) రోజునే కావడం గమనార్హం. ఆ దారుణ ఘటన జరిగి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 20 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో అఫ్ఘాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

అఫ్ఘాన్ లో ప్రస్తుతం 2500 యూఎస్ దళాలున్నాయి. నాటో సంకీర్ణ దళాలతో కలిపి యూఎస్‌లో 9,600 మంది విదేశీ సైన్యం అక్కడ ఉంది. అయితే తాజా ప్రకటనతో అఫ్ఘాన్ నుంచి అమెరికా పూర్తిగా నిష్క్రమించనుంది. సంకీర్ణ దేశాలతో చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే అఫ్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా రెండు కఠిన శరతులను విధించే అవకాశం ఉంది. దేశంలో శాంతిని కాపాడేందుకు కృషి చేయడం, మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడటం వంటివి పక్కాగా అమలుచేస్తేనే బలగాల నిష్క్రమణ ఉంటుందని ఆ దేశ అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

అఫ్ఘాన్ లో సుమారు రెండున్నర దశాబ్దాలుగా సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెరదించాలని భావిస్తూ తాలిబన్లతో శాంతి చర్చలకు సిద్ధమని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, తాలిబన్లతో దోహాలో పలుమార్లు చర్చలు జరిపారు. గతేడాది ఫిబ్రవరిన ప్రారంభమైన చర్చలు పలు దఫాలు కొనసాగాయి. అప్పుడు కుదిరిన ఒప్పందం మేరకు 14 నెలల్లో బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. దాని ప్రకారం ఈ ఏడాది మే నాటికి యూఎస్ బలగాలు అఫ్ఘాన్ ను వీడాలి. కానీ అది కాస్తా ఆలస్యమై సెప్టెంబర్ నాటికి పొడిగించారు.

అఫ్ఘాన్ లో అమెరికా మిలిటరీ జోక్యం ఇలా :

2001 అక్టోబర్ : సెప్టెంబర్ 11 దాడికి అమెరికా బదులు తీర్చుకుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చిన నెల తర్వాత అఫ్ఘాన్ పై బాంబులు కురిపించింది.
2009 ఫిబ్రవరి : అఫ్ఘాన్ లో శాంతి భద్రతలు కరువయ్యాయని, తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారనే నెపంతో నాటో దళాలు అఫ్ఘనిస్తాన్ కు మరలాయి. సుమారు 17 వేల దళాలు అఫ్ఘాన్ గడ్డపై అడుగుపెట్టాయి.
2009 డిసెంబర్ : అఫ్ఘాన్ లో 30 వేల మంది ఉన్న అమెరికా సైన్యాన్ని లక్ష మందికి పెంచాలని అప్పటి యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయం. ఈ బలగాలను 2011 నాటికి ఉపసంహరించుకుంటామని ప్రకటన.
2015 మార్చి : అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అభ్యర్థన మేరకు యూఎస్ బలగాలను మరికొన్నాళ్లు ఇక్కడే ఉంచాలని ఒబామా ప్రకటన.
2015 అక్టోబర్ : యూఎస్ బలగాల ఉపసంహరణ మరింత ఆలస్యమవుతుందని ఒబామా ప్రకటన. 2016 చివరిదాకా 9,800 మంది అమెరికా సైన్యం ఇక్కడే ఉంటుందని వెల్లడి.
2016 జులై : తాలిబన్ల అరాచకాల నేపథ్యంలో మరో ఏడాది పాటు అక్కడే యూఎస్ బలగాలు. వేయి మంది ఉపసంహరణ, అఫ్ఘాన్ లోనే 8,400 మంది అమెరికా సైన్యం.
2017 ఆగస్టు : అఫ్ఘాన్ లో శాంతి స్థాపనకు ప్రస్తుతం ఉన్న దళాలతో పాటు మరిన్ని బలగాలను అక్కడికి పంపిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన.
2019 సెప్టెంబర్ : తాలిబన్, అమెరికా మధ్య కుదిరిన శాంతి చర్చల ఒప్పందం.
2020 ఏప్రిల్ : పలు దఫాల చర్చల అనంతరం 14 నెలల తర్వాత అఫ్ఘాన్ నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణ ఉంటుందని ఇరు దేశాల ప్రకటన.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed