ముఖేష్ అంబానీ ఖాతాలో మరో రికార్డు

by Anukaran |   ( Updated:2020-07-14 07:42:14.0  )
ముఖేష్ అంబానీ ఖాతాలో మరో రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో రికార్డును దక్కించుకున్నారు. ప్రస్తుతం ముఖేష్ సంపద ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈవో ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రయాన్, లారీ పేజ్‌లను దాటిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..రిలయన్స్ ఛైర్మన్ నికర విలువ 72.4 బిలియన్ డాలర్లు కాగా, ఎలన్ మస్క్ నికర విలువ 68.6 బిలియన్ డాలర్లు, లారీపేజ్ సంపద 71.6 బిలియన్ డాలర్లు, బ్రయాన్ సంపద 69.4 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, జులై 15న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన లక్షలాది షేర్ హోల్డర్లతో వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) నిర్వహించనుంది. రిలయన్స్ ప్రస్తుత సమావేశం 43వది. ముంబైలో లాక్‌డౌన్ ఉన్న కారణంగా తొలిసారి వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. గతేడాది నిర్వహించిన ఏజీఎమ్ సమావేశంలో ప్రకటించిన నాలుగు లక్ష్యాలను చేరుకున్నారు. అయితే, బుధవారం జరిగే సమావేశంలో మరిన్ని కీలకమైన లక్ష్యాలను కంపెనీ వెల్లడించనుంది. గతేడాది జరిగిన సమావేశంలో రెండేళ్లలో రిలయన్స్ సంస్థను రుణ రహిత కంపెనీగా మార్చడం లక్ష్యమని ప్రకటించారు. ఇటీవల భారీ పెట్టుబడులతో ఈ లక్ష్యాన్ని చాలా త్వరగా చేరుకున్నారు. బుధవారం జరగబోయే లక్ష్యాల గురించి పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనాల ప్రకారం..రిలయన్స్‌కు చెందిన ఆయిల్ టు కెమికల్ విభాగంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కో కంపెనీకి విక్రయించడంపై మరింత స్పష్టత రావచ్చు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థలను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడంపై వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి. జియోను అంతర్జాతీయ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టింగ్ చేసే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో వాటా కొనుగోలుకు సంబంధించి వివరాలు చెప్పవచ్చు. అలాగే, జియో ఫైబర్ సేవలు, 5జీ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, బోనస్‌లు, ఇతర వివరాలు ప్రకటించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed