మిత్రుడి భార్యకు పూర్వ విద్యార్థుల చేయూత

by Sridhar Babu |   ( Updated:2021-07-28 06:45:19.0  )
మిత్రుడి భార్యకు పూర్వ విద్యార్థుల చేయూత
X

కోదాడ: తమతోపాటు పదవ తరగతి వరకు చదువుకున్న మిత్రుడు అకాల మరణం చెందడంతో తోటి స్నేహితులు కలత చెందారు. మిత్రుని కుటుంబానికి అండగా నిలబడ్డారు. అతని భార్య పేరున రూ. 67,500 బ్యాంక్‎లో డిపాజిట్ చేసిన ఆ పత్రాలను బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన మాలోతు నాగేశ్వరరావు(37) అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమతోపాటు పదవ తరగతి వరకు కాపుగల్లు హైస్కూల్లో చదువుకున్న మిత్రుని మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేక పోయారు. పేదరికంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకున్నారు. మిత్రుని ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు కావడం వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో 1995-96, 1997-98 బ్యాచ్ పదవ తరగతి స్నేహితులు తలాకొంత ఆర్థిక సహాయం అందించారు. అలా వచ్చిన డబ్బులు మొత్తం రూ. 67,500 మిత్రుని భార్య పేరున బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. సంబంధించిన పత్రాలను అతని భార్య, కుటుంబ సభ్యులకు అందించారు. తన భర్త స్నేహితులు అందించిన సహాయం పట్ల భార్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సుధాకర్, అనిల్, శంకర్, వీరరాఘవ, ఆర్.ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ నాగరాజు, జె.రవి, కొండ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed